- 16 ఏళ్ల స్వీడిష్ అమ్మాయి 3 వేల కిలోమీటర్ల కాలుష్యం లేని జర్నీ
- ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు తెరచాప పడవలో ప్రయాణం
- క్లైమేట్ యాక్షన్ సమ్మిట్, కాప్ 25 సదస్సుకు
తనో టీనేజ్ అమ్మాయి. 16 ఏళ్లు. పర్యావరణ ప్రేమికురాలు. ఐక్యరాజ్యసమితి సమావేశానికి వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్‌లో వెళ్తే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాలుష్యానికి కారణమవుతానని అనుకుంది. అసలు కార్బన్‌ను సృష్టించకుండా సదస్సుకు వెళ్లాలని ఫిక్స్ అయింది. ఆటల్లో వాడే ఓ రేసింగ్ యాట్‌లో కాలుష్యం లేని ప్రయాణానికి సిద్ధమైంది. సూర్యశక్తితో నడిచే ఆ బోటులో 3,316 కిలోమీటర్ల ప్రయాణానికి రెడీ అయింది. బయలుదేరింది. తనపేరు గ్రెటా థన్‌బర్గ్. స్వీడన్‌కు చెందిన టీనేజ్ యాక్టివిస్టు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగే యూఎన్ క్లైమెట్ యాక్షన్ సమ్మిట్‌కు, తర్వాత చిలీలోని శాంటియాగోలో జరిగే కాప్ 25 సదస్సుకు గ్రెటా హాజరుకావల్సి ఉంది. కానీ విమానంలో వెళ్తే కార్బన్ విడుదలకు కారణమైన వాళ్లలో తానూ ఒకరినవుతాననుకుంది. అందుకే పర్యావరణానికి హాని చేయకుండా ప్రయాణించేందుకు సిద్ధమైంది. ఇంగ్లండ్ నుంచి న్యూయార్క్‌కు సముద్ర ప్రయాణం చేయాలని ఫిక్స్ అయింది. తను వెళ్లేందుకు గాను రేసింగ్ బోటు ‘మలిజియా 2’ను సిద్ధం చేశారు. లగ్జరీ కోసం కాకుండా వేగంగా వెళ్లేలా డిజైన్ చేశారు. బోటుకు కావాల్సిన విద్యుత్ కోసం సోలార్ ప్యానళ్లు, అండర్ వాటర్ టర్బైన్లు ఏర్పాటు చేశారు. ఆ బోటులో షవర్, టాయిలెట్ ఉండదు. టాయిలెట్‌కు బ్లూ బకెట్స్‌ను వాడుకోవాల్సి ఉంటుంది. గ్రెటాతో పాటు తన తండ్రి, ఓ కెమెరామెన్ న్యూయార్క్ వెళ్తున్నారు. కార్బన్‌ను సృష్టించకుండా ప్రయాణించాలన్న గ్రెటా నిర్ణయం తను చేస్తున్న పనిపై తనకున్న నిబద్ధతను చెబుతోందని బోటు నడిపే స్కిప్పర్ బోరిస్ హర్‌మన్ పొగిడారు.
