కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు.. పెళ్లైన మూడో రోజే కరెంట్ షాక్తో వరుడు మృతి

కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు.. పెళ్లైన మూడో రోజే  కరెంట్ షాక్తో వరుడు మృతి

మన జీవితంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందో మనం ముందే ఊహించలేం అది మన నియంత్రణలో ఉండదు. ఈ మధ్య అనుకోని మరణాలు కొన్ని కలచివేస్తున్నాయి. జీవితం మీద ఆశతో ఎంతో సంతోషంగా నిండు నూరేళ్ల జీవితం అనుభవిద్దామనుకుని అగ్ని సాక్షిగా ఏడడుగుల బంధంతో వివాహబంధంలోకి అడుగు పెడతాం. అలా ఏడు అడుగులు వేసి రెండు రోజులు కూడా గడవకముందే ఓ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.

కాళ్ల పారాణి ఆరకముందే కరెంట్ షాక్ తో  కానరాని లోకాలకు వెళ్లాడు నూతన వరుడు. మహబూబాబాద్ జిల్లాబయ్యారం మండలం గౌరారం శివారు కోడి పుంజుల తండాకు చెందిన  ఇస్తావత్ నరేష్(25)కి ఏపీ కృష్ణా జిల్లా కంకిపాడులో జాహ్నవితో మే 18న పెళ్లి జరిగింది. అనంతరం వధూవరులిద్దరు వరుడి స్వగ్రామానికి వచ్చారు.  ఇవాళ మే 20న వరుడి ఇంటి దగ్గర రిసెప్షన్‌ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే  ఏర్పాట్లలో భాగంగా ఇంట్లో నల్లా మోటార్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి నరేష్ అక్కడిక్కడే చనిపోయాడు.  ఇది చూసిన నవ వధువు జాహ్నవి ఒక్కసారిగా  అస్వస్థతకు గురైంది.  వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. 

కాసేపట్లో కుటుంబ సభ్యులతో,బంధువులతో  సంతోషంగా గడపాల్సిన సమయంలో ఈ అనుకోని విషాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, పెళ్లి ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.