పల్లీకి రేటు వస్తలే.. ప్రతీ వారం ధర తగ్గిస్తున్న ట్రేడర్లు

పల్లీకి రేటు వస్తలే.. ప్రతీ వారం ధర తగ్గిస్తున్న ట్రేడర్లు
  •  ఎంఎస్పీ బాగున్నా రైతులకు దక్కని మద్దతు ధర
  •     పెట్టుబడి పైసలు రాక ఆందోళనలో రైతులు

మహబూబ్​నగర్, వెలుగు: పల్లీ రైతులకు ట్రేడర్లు చెల్లిస్తున్న రేట్​ గిట్టుబాటు కావడం లేదు. ఏటా పంట మార్కెట్​కు వచ్చే టైంలో రేట్​ తగ్గించడంతో రైతులు నష్టపోతున్నారు. ఆ తర్వాత రేట్​పెరగడంతో వ్యాపారులు లాభపడుతున్నారు. మార్కెట్​లో పల్లీకి డిమాండ్ ఉండడంతో మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ సీజన్​లో 12 వేల ఎకరాల్లో పంటను సాగు చేశారు. దీపావళి తర్వాత విత్తనాలు వేసుకోగా, జనవరి రెండో వారం నుంచి పంట కోతకు వస్తోంది. మొదట వచ్చిన పంటకు ట్రేడర్లు క్వింటాలుకు రూ.8 వేల ధర చెల్లించారు. జనవరి చివరిలో మహబూబ్​నగర్, నారాయణపేట, కర్ణాటకలోని రాయచూర్​ ప్రాంతాల నుంచి పాలమూరు అగ్రి మార్కెట్ కు పెద్ద ఎత్తున పంట వచ్చింది. ఇదే అదనుగా భావించిన ట్రేడర్లు రేటును క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. ప్రతీ వారం క్వింటాల్ కు​రూ.500 నుంచి రూ.700 వరకు తగ్గిస్తూ వచ్చారు. జనవరిలో క్వింటాల్​ పల్లీకి రూ.8,100 చెల్లించిన ట్రేడర్లు, ఫిబ్రవరిలో రూ.7,360, తాజాగా బుధవారం క్వింటాల్ పల్లీకి రూ.6,400 నుంచి రూ.5,400 వరకు చెల్లించారు.

ఎంఎస్పీ బాగున్నా.. 

ఈ సీజన్​లో పల్లీ పంటకు మినిమం సపోర్ట్​ ప్రైస్​ రూ.5,850 ఉంది. నిరుడు రూ.5,275 ఉంది. క్వింటాల్​ మీద ప్రభుత్వం రూ.575 పెంచినప్పటికీ ట్రేడర్లు రైతులను దోచుకుంటున్నారు. పల్లీలో తాలు, తేమ శాతం ఎక్కువగా ఉందని రేటులో కోత విధిస్తున్నారు. నిరుడు పల్లీకి అత్యధిక ధర రూ.7,540 చెల్లించగా, మోడల్​ ధర రూ.7,269, మినిమం ధర రూ.4,027 గా ఇచ్చారు. ఈ సీజన్​లో ఎంఎస్పీ బాగానే ఉన్నా.. అత్యధిక ధర రూ.7,132, మోడల్​ ధర రూ.6,279, మినిమం ధర రూ.3,211 చెల్లించడంతో రైతులు నష్టపోతున్నారు.
మూడేండ్లుగా పెరుగుతున్న దిగుబడులు పాలమూరు పల్లీకి మంచి డిమాండ్ ఉండడంతో యాసంగిలో సాగునీటి వసతి ఉన్న రైతులు ఎక్కువగా పల్లీ పంటనే సాగు చేస్తున్నారు. మూడేండ్లుగా మహబూబ్​నగర్, బాదేపల్లి, దేవరకద్ర, నవాబ్​పేట మార్కెట్లలో దాదాపు పది లక్షల క్వింటాళ్ల పల్లీ కొనుగోళ్లు జరిగాయి. మార్కెట్​ లెక్కల ప్రకారం 2018–-19​లో 97 వేల క్వింటాళ్లు, 2019–-20లో 1,26,296, 2020–-21లో 1,37,038, 2021–-22​లో మార్చి చివరి నాటికి 3,98,833 క్వింటాళ్ల వేరుశనగ కొనుగోళ్లు జరిగాయి. 2022–-23 మార్చి 11 నాటికి 3,18,812 క్వింటాళ్లు రైతులు మార్కెట్​కు తీసుకొచ్చారు.

పెట్టుబడి కూడా రావట్లే

పల్లీ సాగుకు ఎకరాకు రైతులకు రూ.25 వేల నుంచి రూ.35 వేల దాకా పెట్టుబడి అవుతోంది. విత్తనాలకు రూ.10 వేలు, ట్రాక్టర్  దున్నడానికి రూ.5 వేలు, కలుపు తీయడానికి కూలీలకు రూ.5 వేలు, స్ర్పే చేయడానికి రూ.400, పిండి సంచులకు రూ.3 వేలు, యూరియాకు రూ.300, మిషన్​కు రూ.3 వేల దాకా ఖర్చు వస్తోంది. పంటను మార్కెట్​కు తీసుకురావడానికి రవాణా చార్జీలు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అవుతున్నాయి. ఇవి కాకుండా మార్కెట్​లో చాట కూలీలు, హమాలీలు, కాంటా చేసే కూలీలందరికీ కలిపి క్వింటాల్ కు​రూ.26 చొప్పున రైతులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రైతు చేసిన కష్టానికి ఫలితం లేకుండా పోతోంది.

25 సంచులే వచ్చినయ్..​

నాకున్న ఎకరం 15 గుంటల్లో పల్లీ వేసిన. ఎకరాకు 30 బస్తాలు వస్తయనుకుంటే అంతా కలిపి 25 సంచులే వచ్చినయ్. జింక్​ కొట్టినా పంట బలంగా పెరగలే. రూ.28 వేల దాకా ఖర్చు అయింది. ఇప్పుడున్న రేట్​ గిట్టుబాటు అయితలేదు. - పెద్ద నర్సింహులు, దంగాన్​పూర్, మద్దూరు మండలం

ధర తగ్గించిన్రు.. 

రెండున్నర ఎకరాల్లో పల్లీ పంట వేసిన. రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరాకు 30 బస్తాలు వస్తాయనుకుంటే,  15 బస్తాలే వచ్చాయి. ధర బాగుందని మార్కెట్​కు వస్తే ఇక్కడ క్వింటాల్​కు రూ.6 వేలు కూడా ఇస్తలేరు. దిగుబడి మంచిగా రాక, మార్కెట్​లో ధర లేక లాస్​ వచ్చింది.  - ధన్వాడ నర్సప్ప, పెద్దజట్రం, ఊట్కూరు