గ్రూప్-1 ప్రిలిమ్స్​..994 కేంద్రాల్లో పరీక్ష

గ్రూప్-1 ప్రిలిమ్స్​..994 కేంద్రాల్లో పరీక్ష
  • ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పరీక్ష
  • అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ – 1​ ప్రిలిమ్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. పరీక్ష నిర్వహణపై చీఫ్ కో ఆర్డినేటింగ్​ ఆఫీసర్లతో శనివారం జనార్దన్ రెడ్డి ఆన్​లైన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీస్, ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, మున్సిపల్, ట్రాన్స్​పోర్ట్, పోస్టల్ శాఖల అధికారులతో కూడా పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. గ్రూప్ – 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. 3,80,081 మంది అప్లయ్ చేసుకోగా, 3,00,836 మంది హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకున్నారని తెలిపారు. నిరుడు అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్​కు 2,86,051 మంది అటెండ్ అయ్యారని గుర్తు చేశారు. ఆ పరీక్ష రద్దు కావడంతో మళ్లీ ఆదివారం నిర్వహిస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 994 మంది చీఫ్​ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, 310 మంది రూట్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ప్రతి సెంటర్​ వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షకు హాజరయ్యే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే సెంటర్​లోపలికి అనుమతించాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ హాల్ టికెట్​తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు. అభ్యర్థులు తమ వెంట సెల్​ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్​లు తెచ్చుకోవద్దన్నారు. అభ్యర్థులు షూస్, బెల్టులు ధరించొద్దని, చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని సూచించారు. పరీక్షల తీరును పర్యవేక్షించడానికి టీఎస్​పీఎస్సీలో కమాండ్​ కంట్రోల్ సెంట్రల్ ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు.