18న సీఎం చేతుల మీదుగా గ్రూప్ 2 నియామక పత్రాలు

18న సీఎం చేతుల మీదుగా గ్రూప్ 2 నియామక పత్రాలు
  • శిల్పకళా వేదికలో ఏర్పాట్లపై సీఎస్​ సమీక్ష

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 783 మంది గ్రూప్-2 ర్యాంకర్లకు ఈ నెల 18న సీఎం  రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నట్టు సీఎస్​ రామకృష్ణారావు తెలిపారు. 16 శాఖలకు చెందిన ఈ ర్యాంకర్లలో సాధారణ పరిపాలన, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారు ఉన్నారు. 

18న సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లపై మంగళవారం సీఎస్ రామకృష్ణారావు​సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులందరినీ ఆహ్వానించనున్నట్టు తెలిపారు. నియామక పత్రాలు పొందే ర్యాంకర్లు, వారి కుటుంబ సభ్యులను సాయంత్రం 4 గంటలలోపు శిల్పకళా వేదికలోకి అనుమతించాలని ఆదేశించారు. 

ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ, హోం, జీఏడీ కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణకు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి, స్పెషల్​ సీఎస్​ వికాస్ రాజ్ సహా పలువురు ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.