జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 ..ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసిన టీఎస్​పీఎస్సీ

జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 ..ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2 ఎగ్జామ్స్ రెండోసారి వాయిదా పడ్డాయి. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 6,7 తేదీల్లో తిరిగి నిర్వహిస్తామని వెల్లడించింది. మంగళవారం టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అంతకుముందే జిల్లా కలెక్టర్ల నుంచి ఎగ్జామ్స్​ నిర్వహణపై  అభిప్రాయాలను సేకరించారు. నామినేషన్ల ప్రారంభం రోజే పరీక్ష ఉండటంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని, వాయిదా వేయాలని టీఎస్ పీఎస్సీని వారు కోరారు. దీంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను.. వచ్చేఏడాది జనవరి 6, 7 తేదీల్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు. కాగా, గతేడాది 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసింది. 

దీనికి 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఈ ఎగ్జామ్స్ ను ఆగస్టు 29, 30 తేదీల్లో పెట్టాలని నిర్ణయం తీసుకోగా, అభ్యర్థుల ఆందోళనలతో  నవంబర్ కు వాయిదా వేశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రెండోసారి వాయిదా పడింది. నిజానికి గ్రూప్ 2 సిలబస్ పెరిగిందని, ఎగ్జామ్ ను వాయిదా వేయాలని అభ్యర్థులు కూడా ఆందోళనలు చేశారు. గ్రూప్ 1 రద్దు కావడంతో ఆ అభ్యర్థులు కూడా గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అయినా ఎగ్జామ్ వాయిదా కుదరదని టీఎస్ పీఎస్సీ తేల్చిచెప్పింది. కానీ ఇప్పుడు ఎన్నికలు రావడంతో వాయిదా అనివార్యమైంది.