గ్రూప్ 3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ రిలీజ్.. సెప్టెంబర్ 30 నుంచి వెబ్ ఆప్షన్స్‌

గ్రూప్  3 అభ్యర్థులకు గుడ్ న్యూస్ :  ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ రిలీజ్.. సెప్టెంబర్ 30  నుంచి వెబ్ ఆప్షన్స్‌
  •     4,421 మంది జనరల్, 81 మంది స్పోర్ట్స్‌ కేటగిరీలో ఎంపిక
  •     వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టిన కమిషన్‌..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,388 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం 4,421 మందిని జనరల్, 81 మందిని స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక చేసింది. ఈ అభ్యర్థులకు సంబంధించిన వివరాలను సోమవారం రాత్రి  అధికారిక వెబ్‌సైట్‌లో కమిషన్‌ పెట్టింది. 

2024 నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. దీనికి 5.36 లక్షల మంది అప్లై చేసుకోగా, 2.67 లక్షల మంది పరీక్షలు రాశారు. ఈ పరీక్షా ఫలితాలను టీజీపీఎస్సీ మార్చిలో రిలీజ్ చేయగా, 2.49 లక్షల మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ (జీఆర్‌‌ఎల్‌)ను ప్రకటించింది. తాజాగా, గ్రూప్ 1,2 సెలక్షన్ లిస్టు ప్రకటనలు రావడంతో.. పెండింగ్‌లోని గ్రూప్ –3 ఫలితాలు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. 

 ఇందులో భాగంగా సోమవారం ప్రొవిజినల్  లిస్ట్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నుంచి అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. వచ్చే నెల 10న సాయంత్రం 5.30 గంటల వరకూ ఈ అవకాశం కల్పించింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్ సైట్‌లోని లింక్స్ ద్వారా మాత్రమే ఆప్షన్లు ఇవ్వాలని కమిషన్ సూచించింది.