సిటీలో పెరుగుతున్న హోమ్​ ఫుడ్ స్టోర్లు

సిటీలో పెరుగుతున్న హోమ్​ ఫుడ్ స్టోర్లు
  •    ఇలాంటి బిజినెస్​పై ఇంట్రెస్ట్​
  •     చిరు వ్యాపారంలోనూ మంచి లాభాలు
  •     సిటీలో పెరుగుతున్న హోమ్​ ఫుడ్ స్టోర్లు

హైదరాబాద్, వెలుగు:  కరోనా మొదలైనప్పటి నుంచి జనాల్లో క్వాలిటీ ఫుడ్​ తినేందుకే ఇంట్రెస్ట్​ పెట్టారు.  హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం కన్నా  ఇంటి ఫుడ్​కే ఎక్కువ ప్రిఫరెన్స్​ఇస్తున్నారు. దీంతో జంక్​ ఫుడ్​కు బదులు ఇంటి ఫుడ్​బండ్లు ఏర్పాటు చేసుకుని చాలామంది బిజినెస్​గా చేసుకుంటున్నారు.  స్నాక్స్​, పచ్చళ్లు, కూరలు ఇలాంటి ఫుడ్​ను ఇంట్లో తయారు చేయడానికి వీలుండగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు హోం మేడ్​ ఫుడ్​ వ్యాపారులు  పొందుతున్నారు. 

 రెండు వేలతోపే ఇన్వెస్ట్​మెంట్

 కరోనా తర్వాత జాబ్స్​ కోల్పోయిన చాలామంది  చిన్న  వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.  అందులో హోం మేడ్ ఫుడ్​బిజినెస్​కు మంచి గిరాకీ ఉంది. గ్రామాల నుంచి సిటీకి వచ్చి చదువుకునే, ఉద్యోగాలు చేసుకునేవారు హోమ్ ఫుడ్ ని ఇష్టపడుతుండగా రోడ్లపై హోంమేడ్​ఫుడ్​స్టోర్లు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. రెండువేల రూపాయల లోపు పెట్టుబడితో ముడిసరుకులు కొని పిండి, కారం పొడులు, మసాలా పొడులు, స్నాక్స్, పచ్చళ్లు తయారు చేస్తున్నారు. వాటిని రోడ్ సైడ్ చిన్న టేబుల్ వేసుకుని అమ్మడం, చిన్న ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి రోడ్ సైడ్ ఆపి సేల్ చేస్తున్నారు.

 టిఫిన్ల​ పిండి రెడీ చేసి అమ్ముతున్నం

 టిఫిన్ టైంలో ఇంట్లో పిండి తయారు చేసుకోవడం ఇబ్బందే. బయట మార్కెట్ లో రెడీమెడ్ అందుబాటులో ఉన్నా చాలామంది తీసుకునేందుకు ఇష్టపడరు.  అదే ఆలోచన వచ్చింది.  ఇంట్లోనే తయారు చేసుకుని అమ్ముతున్నాం. జనాలు కొనేందుకు ముందుకు వస్తున్నారు. దోశ, ఇడ్లి పిండితో పాటు అందులోకి కావల్సిన పొడులు కూడా చేస్తున్నాం. పొడులు క్వాంటిటీని బట్టి ఇస్తున్నాం. ప్రస్తుతం బిజినెస్​బాగానే ఉంది.

– మల్లేశ్, చిరువ్యాపారి, కేపీహెచ్‌బీ

మార్కెట్​ కంటే తక్కువ ధరకే..

ఐదు నెలల నుంచి పచ్చళ్లు, స్నాక్స్ బిజినెస్ చేస్తున్నాం. బయట మార్కెట్ లో కంటే తక్కువ ధరకే అమ్ముతున్నాం.  ఒకేసారి నాలుగైదు కిలోలు చేసి పెట్టి, ప్యాక్ చేస్తాం. చిన్న ట్రాలీ ఆటోలో సాయంత్రం తీసుకెళ్లి పెడతాం. ఇండ్లకు వెళ్లే వాళ్లు  కొనుక్కుంటున్నారు. 
–  మధుసూదన్, చిరువ్యాపారి, షేక్‌పేట్