హైటెక్​ ఎవుసం..వ్యవసాయంలో పెరుగుతున్నటెక్నాలజీ

హైటెక్​ ఎవుసం..వ్యవసాయంలో పెరుగుతున్నటెక్నాలజీ
  • పంటల నిర్వహణలో డ్రోన్లు, రోబోలు
  • చీడల గుర్తింపు, సలహాలిచ్చేందుకు యాప్‌‌లు
  • మన భాషలోనే మొబైల్​కు వాతావరణ వివరాలు
  • సాయిల్​ టెస్ట్​ల కోసం  సెన్సర్లు

హైదరాబాద్, వెలుగువ్యవసాయం హైటెక్​ పరుగులు పెడుతోంది. వాతావరణ పరిస్థితులు మొదలుకుని నాట్లు వేయడం, విత్తనాలు జల్లడం, కలుపు తీయడం, కోతలు కోయడం వరకూ అన్ని పనుల్లోనూ రోబోలు, ఆర్టిఫీషియల్‌‌ ఇంటెలిజెన్స్‌‌ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. దుక్కిదున్నే ట్రాక్టర్‌‌ నుంచి పంట కోసే మిషన్ల వరకూ ఇప్పుడు అందుబాటులో ఉండగా.. పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోయాలి, పురుగు పడితే ఏం చేయాలనేది చెప్పేందుకు మొబైల్​ యాప్​లు రెడీ అయ్యాయి. పంటను నిత్యం పరిశీలించేందుకు డ్రోన్లు.. సరైన సమయంలో వాటిని కోసేందుకు రోబోలు వచ్చాయి.

చీడపీడలు వస్తే వెంటనే గుర్తించేందుకు..

విదేశాల్లో వ్యవసాయంలో డ్రోన్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు, చీడపీడలు వస్తే వెంటనే గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఒక డ్రోన్‌‌ పది నిమిషాల్లో ఎకరా పొలంపై మందులు చల్లగలదు. త్వరలోనే రాష్ట్రంలో కూడా డ్రోన్లతో పంటల ఫొటోలు తీయడం, రసాయనాలు, ఎరువులు పిచికారీ చేయడం సులువయ్యే అవకాశం ఉంది. వ్యవసాయంలో డ్రోన్​ టెక్నాలజీపై సహకారం కోసం ఇటీవలే ప్రొఫెసర్​ జయశంకర్​ అగ్రికల్చర్‌‌ యూనివర్సిటీ.. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డ్రోన్ల సాగులో వినియోగంపై ఆ వర్సిటీ నిఫుణులు మన అధికారులకు శిక్షణ ఇస్తారు. అగ్రికల్చర్​లో డ్రోన్ల వాడకంపై ఇండియన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ అగ్రికల్చర్‌‌ రీసెర్చ్‌‌(ఐసీఏఆర్‌‌) కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇక పంటలను నిత్యం పరిశీలిస్తూ.. సరైన సమయంలో వాటిని కోసే రోబోలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఇప్పటికే రోబోల వాడకం పెరిగింది. ఆప్టికల్‌‌ సెన్సర్ల సాయంతో కలుపు మొక్కలను గుర్తించి నాశనం చేసే రోబోలు వచ్చాయి. ఇవి కలుపు మొక్కలను గుర్తించి.. అక్కడికక్కడే భూమిలో కలిపేస్తాయి.

చీడలను గుర్తిస్తూ.. రేట్లను చెప్పేస్తూ..

యాప్‌‌లు పంటలకు పట్టే చీడపీడలను గుర్తిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నాయి. దిగుబడి అధికంగా రావడం దగ్గర నుంచి, దగ్గరలో ఎక్కడెక్కడ ఎంతెంత రేటు పలుకుతుందో కూడా చెప్పేస్తున్నాయి. సోయింగ్‌‌ యాప్‌‌, రైస్‌‌ ఎక్స్‌‌పర్ట్‌‌, కిసాన్‌‌, సువిధ, అగ్రి మార్కెట్‌‌, ఈ వ్యవసాయం లాంటి యాప్‌‌లను ఇక్రిశాట్‌‌ శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. మన పంట ఆకును యాప్‌‌ ద్వారా క్లిక్‌‌ కొట్టి ఫొటో తీస్తే చాలు.. అది ఏ జాతి ఆకు, దాని కొచ్చిన కీడు ఏమిటి, ఏమేం వాడాలనేది కూడా చెప్పేస్తాయి. రైతుల పనిముట్లు ఏయే రేట్లలో దొరుకుతాయో చెప్పేసే గోల్డ్‌‌ ఫార్మ్‌‌ యాప్‌‌ కూడా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన ఆహార పంటలు వరి, పత్తి, మొక్కజొన్న, గోధుమ, మిరప, పప్పు ధాన్యాల పంటలు కంది, మినుములు, శెనగలు, పెసర, జొన్న, ఉల్లి, కూరగాయలు, అరటి, ద్రాక్ష, మామిడి వంటి పండ్లను ఎలా సాగు చేయాలో యాప్​ల ద్వారా పూర్తి వివరాలు లభిస్తాయి. పంటలపై వచ్చే చీడ, పురుగులు, తెగుళ్లు ఎలా గుర్తించాలి? కాండం, ఆకు, వేరు, పువ్వు, కాయ, పండు, విత్తనం, కంకి మొదలైన వాటికి ఎలా సోకుతాయి? వాటి నివారణ, నియంత్రణకు ఏం చేయాలి? అనేవి యాప్ లోనే తెలుసుకోవచ్చు.

సలహాలిచ్చేందుకు యాప్‌‌లు

వ్యవసాయంలో రైతులకు మెరుగైన సలహాలు ఇచ్చేందుకు పలు యాప్‌‌లు అందుబాటులోకి వచ్చాయి. భూసారం ఎలా ఉంది.. ఎలాంటి ఎరువులు వాడాలి.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? క్లైమేట్​లో అనూహ్య మార్పులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలను ఇవి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాయి. భూమి దున్నడం దగ్గర నుంచి, విత్తనాల శుద్ధి, ఎంత లోతున విత్తనం నాటాలి, కలుపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగు విధానాలు, పంటల కోత, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం వరకు ప్రతి దశలోనూ నేరుగా రైతుల మొబైల్​ ఫోన్లకే మెసేజ్‌‌ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. స్మార్ట్ ఫోన్ లేకపోయినా.. బేసిక్ ఫోన్లతోనే రైతులు తమ మాతృభాషలో సమాచారం అందుకోవచ్చు.