‘గృహలక్ష్మి’కి దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ అనుదీప్

‘గృహలక్ష్మి’కి దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్ అనుదీప్
  •     హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ 

హైదరాబాద్, వెలుగు : సొంత ఇంటి స్థలం ఉంటే గృహలక్ష్మి స్కీమ్​ కింద ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం జీవో. 25ను జారీ చేసిందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ సూచించారు. స్కీమ్ కింద ఇండ్లు కట్టుకుంటే  ప్రభుత్వం100 శాతం సబ్సిడీ ఇస్తుందని పేర్కొన్నారు.  ప్రతి సెగ్మెంట్​లో 3 వేల ఇండ్లకు పర్మిషన్ ఇచ్చినట్టు తెలిపారు. మహిళ లేదా వితంతువు పేరు మీద ఇల్లు మంజూరు అవుతుందని, లబ్ధిదారులు నచ్చిన విధంగా ఇంటిని కట్టుకోవచ్చని వివరించారు. 

రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాఉండాలని చెప్పారు. ఇప్పటికే ఆర్​సీసీ రూఫ్​తో ఇల్లు ఉన్నవారు.. జీవో. 59  కింద లబ్ధిపొందినవారు అర్హులు కారని స్పష్టంచేశారు. ఇంటి నిర్మాణం 3 స్టేజ్​ల్లో ఉంటుందని, ప్రతి స్టేజ్​కు రూ. లక్ష చొప్పున జమ చేస్తామన్నారు.  గృహలక్ష్మి దరఖాస్తులకు కలెక్టరేట్​లో  ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. 

నోటరీ స్థలాల రెగ్యులరైజేషన్​కు ..

పట్టణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర భూములకు రిజిస్టర్ కాని నోటరీ స్థలాల రెగ్యులరైజేషన్​కు దరఖాస్తు చేసుకోవాలని  కలెక్టర్ అనుదీప్ సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులను మీ సేవలో ఇవ్వాలన్నారు.125  చదరపు గజాల్లోపు ఉంటే  స్టాంపు డ్యూటీ, ఫైన్ ఉండదని, ఆపై ఉంటే మార్కెటు రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ 
చెల్లించాలని తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 31 వరకు  అందించాలని తెలిపారు.