
సెప్టెంబర్ 22 నుంచి GST కొత్త విధానం అమల్లోకి రాబోతుంది. ఈ తరుణంలో కొత్తగా ఏ వస్తువు కొనాలన్నా ధర తగ్గుతుందనే ఆశతో వినియోగదారులు అప్పటికి వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ల్యాప్ టాప్స్ కొనే ఆలోచన ఉన్న కొనుగోలుదారులు కూడా ఆ ఆలోచనను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసుకుంటున్నారు. కానీ.. నిజం ఏంటంటే.. జీఎస్టీ కొత్త విధానం అమల్లోకి వచ్చినా ల్యాప్ టాప్ ధరల్లో ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. ఎందుకంటే.. గత జీఎస్టీ స్లాబ్లో స్మార్ట్ ఫోన్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగినట్టుగానే, జీఎస్టీ 2.0లో కూడా ల్యాప్ టాప్స్పై కూడా గతంలో మాదిరిగానే 18 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. జీఎస్టీ తగ్గింపు ల్యాప్ టాప్స్కు వర్తించదు.
కొత్త స్లాబ్ విధానంలో మొబైల్ ఫోన్లపై, ల్యాప్ టాప్స్పై జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి ట్యాక్స్ మినహాయింపు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ రెండు వస్తువులను అత్యవసరం కానివిగా జీఎస్టీ కౌన్సిల్ పరిగణించింది. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. సెప్టెంబర్ 22 తర్వాత కూడా మొబైల్స్, ల్యాప్ టాప్స్పై ధరలు తగ్గే అవకాశం లేదు. ఈ రెండింటిపై 18 శాతం జీఎస్టీ యథావిధిగా కొనసాగుతుంది. కాకపోతే.. పండుగల సీజన్ వస్తున్న తరుణంలో ఈ-కామర్స్ కంపెనీలతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ విక్రయించే ప్రముఖ షోరూమ్స్ మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్పై డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఆ విధంగా ధరలు కాస్తంత తగ్గే అవకాశం ఉంది.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇప్పటికే పండుగ సేల్స్ సెప్టెంబర్ 22 నుంచి ఉండనున్నట్లు ప్రకటించేశాయి. కొత్త స్మార్ట్ ఫోన్ గానీ, కొత్త ల్యాప్ టాప్ గానీ కొనాలనే ఆలోచనలో ఉంటే మాత్రం.. సెప్టెంబర్ 22 తర్వాత కొనుక్కుంటే జీఎస్టీ తగ్గకపోయినా డిస్కౌంట్స్ కారణంగా ధరలు కొంత తగ్గే అవకాశం ఉంది. ఇక.. స్మార్ట్ టీవీలు కొనుక్కునే ఆలోచన ఉంటే మాత్రం.. కచ్చితంగా సెప్టెంబర్ 22 తర్వాతే కొనుక్కోండి. ఎందుకంటే టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. దీని కారణంగా కొత్త జీఎస్టీ విధానంలో టీవీల ధరలు తగ్గనున్నాయి.
మోనిటర్ల ధరలు కూడా తగ్గుతాయి. ఏసీలు, వాషింగ్ మెషీన్లు కొనాలని ప్లాన్ చేస్తున్న వాళ్లు కూడా సెప్టెంబర్ 22 తర్వాత కొనుక్కోవడమే మేలు. ఈ రెండు ఉత్పత్తులపై కూడా జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతం తగ్గింది. ఫలితంగా.. ఏసీలు, వాషింగ్ మెషీన్ల ధరలు ప్రస్తుతం అమ్ముతున్న రేట్ల కంటే 15 వందల నుంచి 2 వేల 500 వరకూ తగ్గే అవకాశం ఉంది.