జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.49 లక్షల కోట్లు

జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.49 లక్షల కోట్లు

అభివృద్ధి చెందిన దేశాల్లో  పెరుగుతున్న వడ్డీ రేట్లు,  స్లో డౌన్‌‌లోకి జారుకున్న గ్లోబల్‌‌ ఎకానమీ ఒకవైపు..రూపాయి పతనం, ఇంకా హై లెవెల్‌‌లోనే కొనసాగుతున్న ఇన్‌‌ఫ్లేషన్‌‌  మరోవైపు.. అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉంది. ఎన్ని అడ్డంకులు ఉన్నా కరోనా గాయాల నుంచి నిలకడగా రికవరీ అవుతోంది. ఇందుకు వరసగా ఐదో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్లను దాటిన జీఎస్‌‌టీ వసూళ్లు, ఎనిమిది నెలల గరిష్టానికి చేరుకున్న మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ డేటా నిదర్శనం.
 

ఒకవైపు జీఎస్‌‌టీ కలెక్షన్స్‌‌, మరోవైపు పీఎంఐ మాన్యుఫాక్చరింగ్ ఇండెక్స్‌‌.. ఎకానమీ వేగంగా రికవరీ అవుతుందనే సంకేతాలను ఇస్తున్నాయి.  జీఎస్‌‌టీ కలెక్షన్స్  జులై నెలలో రూ. 1,48,995 కోట్లకు పెరిగింది. జీఎస్‌‌టీ అమల్లోకి  వచ్చాక ఇంతలా జీఎస్‌‌టీ రెవెన్యూ రావడం ఇది రెండో సారి మాత్రమే. కిందటేడాది జులై నెల జీఎస్‌‌టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది జులైలో  వచ్చిన జీఎస్‌‌టీ రెవెన్యూ 28 శాతం ఎక్కువని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌‌లో  జీఎస్‌‌టీ వసూళ్లు రూ. 1.44 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. కిందటేడాది జులై నెలతో పోలిస్తే ఈ జులైలో దిగుమతుల  నుంచి వచ్చిన రెవెన్యూ 48 శాతం పెరిగిందని, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ల (సర్వీస్‌‌ల దిగుమతులను కలిపి)  నుంచి వచ్చిన జీఎస్‌‌టీ రెవెన్యూ 22 శాతం పెరిగిందని ఫైనాన్స్ మినిస్ట్రీ వివరించింది. సెంట్రల్ జీఎస్‌‌టీ వసూళ్లు జులై నెలలో రూ. 25,751 కోట్లుగా, స్టేట్ జీఎస్‌‌టీ వసూళ్లు రూ. 32,807 కోట్లుగా రికార్డయ్యాయి. ఇంటిగ్రేటెడ్‌‌ జీఎస్‌‌టీ వసూళ్లు రూ. 79,518 కోట్లుగా నమోదయ్యాయి.  వస్తువుల దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్‌‌టీ రూ. 41,420 కోట్లు  ఈ ఇంటిగ్రేటెడ్‌‌ జీసెస్‌‌టీలో కలిసి ఉన్నాయి.  సెస్ కింద రూ. 10,920 కోట్లు  వసూళ్లయ్యాయి. ఇందులో  వస్తువుల దిగుమతులపై వేసిన సెస్ అమౌంట్ రూ. 995 కోట్లు కూడా  కలిసి ఉంది.

ఈ ఏడాది టార్గెట్‌‌ను దాటేస్తం..
నెలవారీ జీఎస్‌‌టీ వసూళ్లు వరసగా ఐదో నెలలోనూ రూ. 1.4 లక్షల కోట్లకు పైన నమోదయ్యాయి.  కిందటేడాది జులై నాటికి వసూళ్లయిన జీఎస్‌‌టీ రెవెన్యూతో పోలిస్తే, ఈ ఏడాది జులై నాటికి వసూళ్లయిన జీఎస్‌‌టీ విలువ 35 శాతం ఎక్కువ. ‘ఎకానమీ రికవరీ అవుతుండడంతో జీఎస్‌‌టీ వసూళ్లు నిలకడగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌‌లో మొత్తం 7.45 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. ఇది ఈ ఏడాది మే నెలలో జనరేట్ అయిన 7.36 కోట్లతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ’ అని ఫైనాన్స్ మినిస్ట్రీ వివరించింది.  గతంలో జీఎస్‌‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వలనే  జీఎస్‌‌టీ వసూళ్లు పెరుగుతున్నాయని పేర్కొంది.  జీఎస్‌‌టీ కలెక్షన్స్ నిలకడగా రికార్డ్ లెవెల్‌‌లో నమోదవుతుండడాన్ని బట్టి చూస్తుంటే కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ రికవరీ అయ్యిందని తెలుస్తోందని  కేపీఎంజీ ఇండియా పార్టనర్‌‌‌‌ అభిషేక్‌‌ జైన్ అన్నారు. జీఎస్‌‌టీ వసూళ్ల పెరుగుదలకు ఇన్‌‌ఫ్లేషన్‌‌, ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు కూడా కారణంగా ఉన్నాయని పేర్కొన్నారు.  శ్లాబ్‌‌ల రేట్లను జీఎస్‌‌టీ కౌన్సిల్ సవరించడంతో రానున్న నెలల్లో  దేశ జీఎస్‌‌టీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌‌టీ కింద రూ. 12.5 లక్షల కోట్ల రెవెన్యూ వస్తుందని  ప్రభుత్వం టార్గెట్‌‌గా పెట్టుకోగా, మొదటి ఐదు నెలల్లోనే రూ. 7.5 కోట్లను సేకరించగలిగింది. రానున్న ఐదు నెలల్లో పండగ సీజన్ ఉంటుందని, అందువలన జీఎస్‌‌టీ వసూళ్లు మరింత పెరుగుతాయని ట్యాక్స్‌‌ కనెక్ట్‌‌  అడ్వైజరీ వివేక్ జలాన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌‌టీ రెవెన్యూ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్‌‌ కంటే 40 శాతం ఎక్కువగా నమోదవ్వొచ్చని అంచనావేశారు. 

తయారీలో వేగం..
దేశంలో తయారీ రంగం జోరు కొనసాగుతోంది. దేశ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ యాక్టివిటీని  కొలిచే మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్‌‌ ఇండెక్స్ (పీఎంఐ)  జులై నెలలో ఎనిమిది నెలల గరిష్టాన్ని నమోదు చేసింది.  ఈ ఏడాది జూన్‌‌లో 53.9 గా రికార్డయిన పీఎంఐ డేటా, జులై నెలలో 56.4 శాతానికి పెరిగింది. కంపెనీలు  ముడిసరుకులను  కొనడం పెంచాయని,  ఫుల్ కెపాసిటీతో  ఆపరేటింగ్ చేయడంలో కంపెనీలపై ఎటువంటి ఒత్తిడి లేదని పీఎంఐ డేటాను విడుదల చేసిన ఎస్ అండ్ పీ గ్లోబల్‌‌ పేర్కొంది.  ముడిసరుకుల ధరలు కూడా తగ్గుతుండడంతో కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌ను పెంచుతున్నాయని తెలిపింది. కానీ, ఉద్యోగాలను క్రియేట్ చేయడం పెద్దగా పెరగలేదని వివరించింది. జులై నెలలో దేశంలోని కంపెనీలకు వచ్చిన  ఆర్డర్లు పెరిగాయని వెల్లడించింది.

రూపాయికి బలం.. 
రూపాయి విలువ సోమవారం 22 పైసలు బలపడి 79.02 వద్ద సెటిలయ్యింది. 80 వరకు పడిన రూపాయి ఆ లెవెల్‌‌ నుంచి రికవరీ అవుతోంది. క్రూడాయిల్ ధరలు తగ్గడంతోపాటు,  డాలర్ విలువ పడుతుండడంతో  రూపాయికి సపోర్ట్ లభిస్తోంది.   79.16 వద్ద ఓపెన్ అయిన రూపాయి, ఇంట్రాడేలో 79 వరకు వెళ్లింది.

58 వేల పైకి సెన్సెక్స్‌‌..
బెంచ్‌‌మార్క్‌‌ ఇండెక్స్‌‌లయిన సెన్సెక్స్, నిఫ్టీలు వరసగా నాల్గో సెషన్‌‌లోనూ పెరిగి కీలక లెవెల్స్‌‌ను ఈజీగా క్రాస్ చేశాయి. హెవీ వెయిట్ షేరు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, వెహికల్ కంపెనీల షేర్లు పెరగడంతో సెన్సెక్స్ సోమవారం 545 పాయింట్లు (0.95%) పెరిగి 58,116 వద్ద క్లోజయ్యింది. ఈ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్ ఈ ఏడాది ఏప్రిల్‌‌ 13 తర్వాత మొదటి సారిగా 58 వేల లెవెల్‌‌ పైన ముగిసింది. నిఫ్టీ 182 పాయింట్లు లాభపడి 17,340 వద్ద ముగిసింది. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌ కంపెనీలు  కార్లీల్‌‌, అడ్వెంట్‌‌ ఇంటర్నేష నల్​లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించడంతో యెస్  బ్యాంక్‌‌ షేరు సోమవారం   6 % లాభపడింది. చివరికి 3.34 % లాభంతో 15.45 వద్ద క్లోజయ్యింది.