
న్యూఢిల్లీ: స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఐదు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.08 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో వసూళ్లు విలువ రూ. 11.37 లక్షల కోట్లు మాత్రమేనని సోమవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జీఎస్టీ వసూళ్ల విలువ 2024-–25లో లైఫ్‌టైం హై అయిన రూ. 22.08 లక్షల కోట్లను తాకింది.
ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 9.4 శాతం ఎక్కువ. 2025 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.1.68 లక్షల కోట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.1.51 లక్షల కోట్లు వచ్చాయి. గత ఎనిమిది సంవత్సరాలలో, జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2017లో 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పైగా పెరిగింది.
జులై 1, 2017న ప్రారంభమై జీఎస్టీ సోమవారంతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాదాపు 17 స్థానిక పన్నులు, 13 సెస్సులను కలిపి జీఎస్టీ విధానాన్ని ప్రవేశపెట్టారు. నెలవారీ జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2025లో రికార్డు స్థాయిలో రూ. 2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి.