జూన్‌ జీఎస్‌టీ @1.44 లక్షల కోట్లు!

జూన్‌ జీఎస్‌టీ @1.44 లక్షల కోట్లు!
  • జూన్‌ జీఎస్‌టీ @1.44 లక్షల కోట్లు!
  • రూ. 3,901 కోట్లకు తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఏడాది వరసగా నాలుగో నెలలోనూ  జీఎస్‌‌‌‌‌టీ వసూళ్లు రూ. 1.4 లక్షల కోట్ల మార్క్‌‌ను క్రాస్ చేశాయి. కిందటేడాది జూన్‌‌  కలెక్షన్స్‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌లో జీఎస్‌‌టీ వసూళ్లు 56 శాతం పెరిగి రూ. 1.44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. తెలంగాణ జీఎస్‌టీ వసూళ్లు 37 శాతం పెరిగి రూ. 3,901 కోట్లకు పెరిగాయి. ఎకానమీ రికవరీ అవుతుండడంతో పాటు, ట్యాక్స్ ఎగవేతలను ఆపేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండడంతో జీఎస్‌‌టీ వసూళ్లు భారీగా పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా, జీఎస్‌‌టీ తీసుకొచ్చి శుక్రవారంతో ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఫైనాన్స్‌‌ మినిస్టర్ మాట్లాడుతూ..నెల వారీ జీఎస్‌‌టీ కలెక్షన్స్‌‌కు రూ. 1.4 లక్షల కోట్ల లెవెల్‌‌  తక్కువ స్థాయిగా కనిపిస్తోందని అన్నారు.  కాగా, నెలవారీ జీఎస్‌‌టీ కలెక్షన్స్ రూ. 1.4 లక్షల కోట్లను దాటడం ఇది ఐదోసారి మాత్రమే. ఈ ఏడాది మార్చి నుంచి లెక్కిస్తే వరసగా నాలుగోసారి. మొత్తంగా జూన్ జీఎస్‌‌టీ కలెక్షన్స్‌‌లో  సీజీఎస్‌‌టీ వాటా రూ. 25, 306 కోట్లుగా, ఎస్‌‌జీఎస్‌‌టీ రూ.32406 కోట్లుగా, ఐజీఎస్‌‌టీ రూ. 75, 887 కోట్లుగా, సెస్ రూ. 11,018 కోట్లుగా  ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటించింది.