న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబరులో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ. 1.73 లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే అంతకుముందు నెల 1.75 లక్షల కోట్లు వచ్చాయి. సెప్టెంబర్ 2023లో రూ. 1.62 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది. ఈసారి సెప్టెంబర్‌లో జీఎస్టీ వృద్ధి వేగం 6.3 శాతంగా ఉంది. వసూళ్లలో సింగిల్ డిజిట్ పెరుగుదల ఇది రెండోసారి.
గత 39 నెలల్లో కనిష్ట వృద్ధి రేటు. జూన్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు 7.7 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో జీఎస్టీ వసూళ్లు రూ.1.86 లక్షల కోట్లు కాగా, రెండో క్వార్టర్లో సగటు జీఎస్‌టీ వసూళ్ల వేగం నెలవారీగా రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది. సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ. 10.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇవి 2024 ఆర్థిక సంవత్సరం మొదటి సగంతో పోలిస్తే 9.5 శాతం ఎక్కువ.