జీఎస్​టీ వసూళ్లు.. రూ. 1.59 లక్షల కోట్లు

జీఎస్​టీ వసూళ్లు.. రూ. 1.59 లక్షల కోట్లు

న్యూఢిల్లీ : ఆగస్టు నెలలో జీఎస్​టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లకు చేరినట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ డేటా వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆగస్టు నెలలో ఈ జీఎస్​టీ వసూళ్లు రూ. 1.43 లక్షల కోట్లు.  జులై నెలలో కూడా ఏడాది ప్రాతిపదికన జీఎస్​టీ కలెక్షన్స్‌ ఇంచుమించు ఇదే గ్రోత్​ రేటుతో రూ. 1.65 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఆగస్టులో .4,393 కోట్లు వసూళ్లయ్యాయి.

 కిందటేడాది ఆగస్టులో వచ్చిన   రూ.3,871 కోట్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ.  జీఎస్‌టీ  ఆగస్టు నెల వసూళ్లలో సీజీఎస్​టీ రూ. 28,328 కోట్లు, ఎస్​జీఎస్​టీ రూ. 35,794 కోట్లు, ఐజీఎస్​టీ రూ. 83,251 కోట్లు, సెస్​ రూ. 11,695 ఉన్నట్లు ఫైనాన్స్​ మినిస్ట్రీ ఒక స్టేట్​మెంట్లో తెలిపింది. సీజీఎస్​టీ నుంచి రూ. 37,581 కోట్లు, ఐజీఎస్​టీ నుంచి రూ. 31,408 కోట్లను ఎస్​జీఎస్​టీకి బదలాయించినట్లు పేర్కొంది. దీంతో ఆగస్టు నెలలో రెగ్యులర్​ సెటిల్​మెంట్​ తర్వాత సీజీఎస్​టీ వసూళ్లు రూ. 65,909 కోట్లు, ఎస్​జీఎస్​టీ వసూళ్లు రూ. 67,202 కోట్లుగా నిలిచినట్లు వివరించింది. 

ఆగస్టు నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన రెవెన్యూ 3 శాతం ఎక్కువగా, డొమెస్టిక్​ ట్రాన్సాక్షన్​ల నుంచి వచ్చిన రెవెన్యూ 14 శాతం ఎక్కువగా ఉన్నట్టు డేటా ద్వారా తెలుస్తోంది. పండగల సీజన్​ మొదలవడంతో రాబోయే నెలల్లో జీఎస్​టీ వసూళ్లు మరింత ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఇండ్లు, కార్లు, వెకేషన్స్​, ఇతర కన్జూమర్​ వస్తువుల కొనుగోళ్ల జోరు పెరుగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.

మేరా బిల్​ మేరా అధికార్​ కోసం రూ. 30 కోట్లు....

మేరా బిల్​ మేరా అధికార్​ స్కీము కింద రివార్డుల కోసం రూ. 30 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కకి పెట్టాయి. ఆరు రాష్ట్రాలలో అమలులోకి తెచ్చిన ఈ స్కీము  మొబైల్  ​యాప్​ను ఇప్పటికే 50 వేల మంది డౌన్​లోడ్​ చేసుకున్నట్లు హర్యానా డిప్యూటీ చీఫ్​ మినిస్టర్​ దుష్యంత్​ చౌతాలా చెప్పారు.