జీఎస్టీ కలెక్షన్స్​ @ రూ.1.62 లక్షల కోట్లు

జీఎస్టీ కలెక్షన్స్​ @ రూ.1.62 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు గత నెల వార్షికంగా పది శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును అధిగమించడం ఇది నాలుగోసారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.  2023 సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ కలెక్షన్స్‌ కంటే 10 శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

సెప్టెంబరులో  సీజీఎస్టీ రూ.29,818 కోట్లు కాగా, ఎస్​జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.41,145 కోట్లతో సహా)  సెస్ రూ.11,613 కోట్లు ( వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ.881 కోట్లతో సహా) ఉన్నాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుంచి సీజీఎస్టీకి రూ.33,736 కోట్లు, ఎస్ జీఎస్టీకి రూ.27,578 కోట్లు చెల్లించింది. 

రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత సెప్టెంబర్ 2023 నెలలో కేంద్ర, రాష్ట్రాల మొత్తం ఆదాయం నుంచి సీజీఎస్టీకి రూ.63,555 కోట్లు అందగా, ఎస్​జీఎస్టీ  రూ.65,235 కోట్లు అందాయి.  

ఈసారి కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ అత్యధిక వృద్ధి రేటును (81 శాతం) సాధించింది.  మణిపూర్ 47శాతం వృద్ధి రేటుతో రెండో స్థానంలో,  తెలంగాణ 33శాతం వృద్ధి రేటుతో మూడో స్థానంలో ఉన్నాయి.