జీఎస్‌‌టీ వసూళ్లు  రూ.1.49 లక్షల కోట్లు

జీఎస్‌‌టీ వసూళ్లు  రూ.1.49 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: జీఎస్‌‌‌‌‌‌‌‌టీ వసూళ్లు వరుసగా 12 వ  నెలలోనూ  రూ.1.4 లక్షల కోట్ల మార్క్‌‌‌‌ను క్రాస్ చేశాయి. కిందటి నెలలో జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్‌‌‌‌ రూ.1.49 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి.  ఫిబ్రవరి, 2022 లో వచ్చిన కలెక్షన్స్‌‌‌‌తో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ.  దేశ ఎకానమీ నిలకడగా ఉండడం, లగ్జరీ గూడ్స్ అమ్మకాలు పెరగడం వంటి  అంశాలు ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడానికి సాయపడ్డాయి.   ఈ ఏడాది జనవరిలో రూ.1.58 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1,49,577 కోట్లు జీఎస్‌‌‌‌టీ కింద వచ్చాయని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. 28 రోజులే ఉంటాయి కాబట్టి మిగిలిన నెలలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్‌‌‌‌ తక్కువగా ఉంటాయని వివరించింది. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ల (సర్వీస్‌‌‌‌ల దిగుమతులపై వేసిన జీఎస్‌‌‌‌టీ కలిపి) నుంచి వచ్చిన రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగిందని, అలానే వస్తువుల దిగుమతుల నుంచి వచ్చిన జీఎస్‌‌‌‌టీ 6 శాతం పెరిగిందని తెలిపింది.   ప్రభుత్వ డేటా ప్రకారం, మొత్తం జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్‌‌‌‌లో రూ.27,662 కోట్లు సెంట్రల్ జీఎస్‌‌‌‌టీ నుంచి, రూ.34,915 కోట్లు స్టేట్ జీఎస్‌‌‌‌టీ నుంచి, రూ.75,069 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్‌‌‌‌టీ (ఐజీఎస్‌‌‌‌టీ) నుంచి వచ్చాయి.  ఐజీఎస్‌‌‌‌టీలో వస్తువుల దిగుమతులపై వేసిన జీఎస్‌‌‌‌టీ రూ.35,689 కోట్లు కలిసి ఉన్నాయి. అలానే సెస్‌‌‌‌ కింద రూ.11,931 కోట్లు (ఇందులో గూడ్స్ ఇంపోర్ట్స్‌‌‌‌పై వేసిన రూ.792 కోట్లు కలిసి ఉన్నాయి) వచ్చాయి. జీఎస్‌‌‌‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత సెస్ కింద ఫిబ్రవరి నెలలోనే ఎక్కువ వచ్చిందని ప్రభుత్వం ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. 

స్ట్రాంగ్‌‌‌‌గా ఎకానమీ..

జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్  నిలకడగా పెరుగుతుండడం చూస్తుంటే డొమెస్టిక్‌‌‌‌గా ఎకానమీ బలంగా ఉందని తెలుస్తోందని కేపీఎంజీ ఎనలిస్టు అభిషేక్‌‌‌‌ జైన్ అన్నారు. ట్యాక్స్ అధికారులు  పొగాకు, పాన్ మసాలా తయారీదారులపై  దాడులు పెంచారని, ఫలితంగా సెస్‌‌‌‌ కలెక్షన్స్ పెరిగాయని మరో ఎనలిస్టు అన్నారు.  జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్ తగ్గాయని, డిసెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్ ముగియడంతో జనవరిలో కలెక్షన్స్ ఎక్కువగా జరగడమే ఇందుకు కారణమని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్‌‌‌‌ అదితి నాయర్  పేర్కొన్నారు. అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను  వెరిఫై చేసుకోవడానికి  ట్యాక్స్‌‌‌‌ అధికారులకు జీఎస్‌‌‌‌టీఎన్ పోర్టల్‌‌‌‌ సాయపడుతోందని  ఎన్‌‌‌‌ఏ షా అసోసియేట్స్ కు చెందిన పరాగ్‌‌‌‌ మెహతా అన్నారు.  కన్జూమర్లు చేస్తున్న ఖర్చులు కూడా పెరిగాయని, దీంతో ట్యాక్స్ కలెక్షన్స్ ఊపందుకున్నాయని చెప్పారు. 

రాష్ట్రం నుంచి రూ. 4,424 కోట్లు

కిందటి నెలలో రాష్ట్రం నుంచి రూ.4,424 కోట్లు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కింద వసూలయ్యాయి. ఫిబ్రవరి, 2022 లో వచ్చిన రూ.4,113 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌‌‌‌ నుంచి జీఎస్‌‌‌‌టీ కలెక్షన్స్ రూ. 3,157 కోట్ల నుంచి రూ.3,557 కోట్లకు పెరిగాయి. కిందటి నెలలో  గరిష్టంగా మహారాష్ట్ర నుంచి రూ. 22,349 కోట్లు,  కర్నాటక నుంచి రూ.10,809 కోట్లు, గుజరాత్ నుంచి రూ.9,574 కోట్లు, తమిళనాడు నుంచి రూ.8,774 కోట్లు, ఉత్తరప్రదేశ్‌‌‌‌ నుంచి రూ.7,431 కోట్లు వసూలయ్యాయి.