5 శాతం బదులు 3 శాతమే.. రేట్లను మార్చనున్న జీఎస్టీ కౌన్సిల్ 

5 శాతం బదులు 3 శాతమే.. రేట్లను మార్చనున్న జీఎస్టీ కౌన్సిల్ 

రాష్ట్రాల ఆదాయాన్ని పెంచడానికే.. 

న్యూఢిల్లీ: జీఎస్టీ శ్లాబులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నుంచి కొన్ని వస్తువులను ఐదు శాతం శ్లాబ్​ నుంచి మూడు శాతం శ్లాబ్ కు మార్చుతారని, కొన్నింటిని 8 శాతం శ్లాబ్​కు తీసుకొస్తారని తెలుస్తోంది. ఐదుశాతం శ్లాబు ఇక నుంచి ఉండకపోవచ్చు. నష్టపరిహారం కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఆదాయాన్ని పెంచుకునేందుకు చాలా రాష్ట్రాలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే నెలలో జరగనున్న జీఎస్‌‌టీ కౌన్సిల్ సమావేశంలో 5 శాతం శ్లాబును తొలగించే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉంది. సామూహిక వినియోగ వస్తువులను 3 శాతం శ్లాబ్​లోనికి,  మిగిలినవి 8 శాతానికి కేటగిరీకి బదలాయించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, జీఎస్టీ లో 5, 12, 18,  28 శాతం శ్లాబులు ఉన్నాయి. బంగారం, నగలపై 3 శాతం పన్ను విధిస్తారు. అన్​బ్రాండెడ్,  ప్యాక్ చేయని ఆహార పదార్థాలు వంటి వస్తువులపై జీఎస్టీ వసూలు చేయడం లేదు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని ఆహారేతర వస్తువులను 3 శాతం శ్లాబ్‌‌కి తరలించడం ద్వారా మినహాయింపు వస్తువుల జాబితాను తగ్గించాలని కౌన్సిల్ భావిస్తోంది. 5 శాతం శ్లాబ్‌‌ను 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని, కేంద్రం  రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకుంటుందని సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు.  ఐదుశాతం శ్లాబులోని ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్‌‌పై పన్నును ఒక శాతం పెంచితే సుమారుగా ఏటా రూ. 50వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. వివిధ ప్రపోజల్స్​ పరిశీలనలో ఉన్నప్పటికీ, కౌన్సిల్ ప్రస్తుతం 5 శాతం పన్ను చెల్లిస్తున్న చాలా వస్తువులపై 8 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రపోజల్​కు ఓటేసే అవకాశాలు ఉన్నాయి.  

మరిన్ని వస్తువులపై పన్ను బాదుడు
అత్యవసర  వస్తువులకు పన్నుల నుంచి మినహాయింపు ఇస్తారు లేదా తక్కువ రేటుతో పన్ను వసూలు చేస్తారు. లగ్జరీ,  డీమెరిట్ వస్తువులు అత్యధిక పన్ను శ్లాబులోకి వస్తాయి. సిగరెట్, సిగార్స్​ వంటి లగ్జరీ,  సిన్ గూడ్స్ కూడా అత్యధికంగా 28 శాతం శ్లాబ్ లో ఉన్నాయి. జీఎస్టీ అమలు కారణంగా రాష్ట్రాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి వీటిపై విధించే సెస్​ను ఉపయోగిస్తారు. ఈ ఏడాది జూన్‌‌లో జీఎస్టీ పరిహారం విధానం ముగుస్తున్నందున, రాష్ట్రాలు స్వయం సమృద్ధి సాధించడం తప్పనిసరి. జీఎస్టీ వసూళ్లలో ఆదాయ అంతరాన్ని తగ్గించడానికి కేంద్రంపై ఆధారపడకుండా ఉండాలి. ఇందుకోసం పన్నుల జాబితాలోకి మరిన్ని వస్తువులను చేర్చడం, శ్లాబులను మార్చడం వంటి ప్రపోజల్స్​ను కౌన్సిల్​ పరిశీలిస్తోంది. పన్ను రేట్లను మార్చడం ద్వారా ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను సూచించడానికి,  పన్నుల విధానంలో తేడాలను, లోపాలను సరిదిద్దడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నాయకత్వంలోని  రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ప్యానెల్‌‌ను కౌన్సిల్ పోయిన సంవత్సరం ఏర్పాటు చేసింది. ఈ మంత్రుల బృందం వచ్చే నెలలోనే దాని సిఫార్సులను ఖరారు చేసే అవకాశం ఉంది. 

వచ్చే నెలలో సమావేశం
ఈ ఏడాది మే నెలలో జరిగే తదుపరి సమావేశంలో కౌన్సిల్ ముందు బొమ్మై కమిటీ సిఫార్సులను ఉంచుతారు. 2017 జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమలవుతున్నది. రాష్ట్రాలకు ఐదేళ్లపాటు.. అంటే జూన్ 2022 వరకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2015–16  బేస్ ఇయర్ ఆదాయంపై సంవత్స రానికి 14 శాతం ఆదాయానికి హామీ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. గత కొన్ని సంవత్సరాల్లో జీఎస్టీ కౌన్సిల్ పరిశ్రమల ఒత్తిడి వల్ల పన్ను రేట్లను తగ్గించింది. ఉదాహరణకు, అత్యధికంగా 28 శాతం పన్ను  ఉన్న వస్తువుల సంఖ్య 228 నుండి 35 కంటే తక్కువకు తగ్గింది. జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్లకు మించి పొడిగించకూడదన్న తన వైఖరికి కేంద్రం కట్టుబడి ఉండటంతో, అధిక పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే కౌన్సిల్ ముందు ఉన్న ఏకైక మార్గమని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.