
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు వల్ల అందరికీ మేలు జరుగుతోందని, అన్ని వర్గాల వినియోగదారులకు ప్రయోజనం దక్కుతోందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పన్ను ప్రయోజనాలను అంతిమ వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయో లేదో నిర్ధారించడానికి ప్రభుత్వం 54 కీలక వస్తువుల ధరలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
జనం రోజువారీ ప్రభావితం చేసే ప్రతి వస్తువును తాను స్వయంగా చెక్చేశానని, తగ్గింపు బదిలీ అవుతున్నదని ప్రకటించారు. కొత్త జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అయితే హై-ఎండ్ పోర్ట్ ల్యాండ్ సిమెంట్ వంటి ప్రొడక్టుల ధరలు అంచనా వేసిన దానికంటే తక్కువగా తగ్గాయని చెప్పారు. జీఎస్టీ తగ్గింపులు సెప్టెంబర్ 22, నవరాత్రి మొదటి రోజు నుంచి అమలయ్యాయని, వినియోగదారులు వాటిని స్వాగతించారని ఆమె అన్నారు.
తాజా జీఎస్టీ తగ్గింపుల్లో చాలా వరకు వస్తువులపై రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి, 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అనంతరం గోయల్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత జీఎస్టీ 2.0 అతిపెద్ద సంస్కరణ అని అన్నారు. దీనివల్ల జనం మరింత కొంటారని, పెట్టుబడులు పెరుగుతాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి ఊతం దొరుకుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
చాలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేశాయని వైష్ణవ్ ప్రకటించారు. నవరాత్రి సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ఎయిర్ కండిషనర్‌లు, వాషింగ్ మెషీన్‌లు, సెట్-టాప్ బాక్స్‌లు వంటి ఎలక్ట్రానిక్స్అమ్మకాలు 20–25 శాతం పెరిగాయని వెల్లడించారు. జీఎస్టీ 2.0 వల్ల ఆహార ధరలు విపరీతంగా తగ్గాయన్నారు.