GT vs DC: ఢిల్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. గుజరాత్‌పై భారీ విజయం

GT vs DC: ఢిల్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. గుజరాత్‌పై భారీ విజయం

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ బౌలర్లు విజృంభించడంతో గుజరాత్‌ 89 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రిషబ్ సేన 8.5 ఓవర్లలోనే చేధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ.. నెట్ రన్‌రేట్‌ను భారీగా మెరుగు పరుచుకుంది.

గుజరాత్ నిర్ధేశించిన 90 పరుగుల స్వల్ప చేధనలో ఢిల్లీ 25 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. రెండో ఓవర్‌ చివరి బంతికి జేక్‌ ఫ్రేజర్‌ (20) ఔటయ్యాడు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో పృథ్వీ షా (7) వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షై హోప్.. సందీప్ వారియర్‌ వేసిన ఐదో ఓవర్‌లో తొలి మూడు బంతులను 4, 6, 6.. బాదాడు. అదే ఓవర్ ఐదో బంతిని అభిషేక్ పొరెల్ (9; 5 బంతుల్లో) సిక్స్‌గా మలచడంతో ఆ  ఓవర్‌లో 23 పరుగులు వచ్చాయి. అనంతరం పేలవ షాట్లు ఆడి పొరెల్, హోప్ వెనుదిరిగారు. ఆపై రిషభ్‌ పంత్(16 నాటౌట్), సుమిత్ కుమార్ (9 నాటౌట్), జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ మ్యాచ్ ముగించారు.

ఆదుకున్న రషీద్ ఖాన్

అంతకుముందు ఢిల్లీ బౌలర్లు విజృంభించడంతో గుజరాత్‌ 89 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్(31) మినహా గుజరాత్‌ బ్యాటర్లలో ఎవ్వరూ చెప్పుకోదగ్గ పరుగులు కూడా చేయలేదు. శుభ్‌మన్‌ గిల్(8), వృద్ధిమాన్ సాహా(2), సాయి సుదర్శన్‌ (12), డేవిడ్ మిల్లర్(2), అభినవ్ మనోహర్(8), షారుఖ్ ఖాన్(0), రాహుల్ తెవాటియా(10).. ఇలా కీలక బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రషీద్ ఖాన్ పోరాడడంతో గుజరాత్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో రెండు.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.