GT vs DC: పంత్ మెరుపు కీపింగ్.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్

GT vs DC: పంత్ మెరుపు కీపింగ్.. 89 పరుగులకే గుజరాత్ ఆలౌట్

సొంతగడ్డపై గుజరాత్ బ్యాటర్లు తడబడ్డారు. అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టైటాన్స్ 89 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రషీద్ ఖాన్ చేసిన 31 పరుగులే అత్యధికం. శుభ్‌మన్‌ గిల్(8), వృద్ధిమాన్ సాహా(2), సాయి సుదర్శన్‌ (12), డేవిడ్ మిల్లర్(2), అభినవ్ మనోహర్(8), షారుఖ్ ఖాన్(0), రాహుల్ తెవాటియా(10).. ఇలా కీలక బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ను ఇషాంత్ శర్మ దెబ్బకొట్టాడు. తన తొలి ఓవర్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌‌ను పెవిలియన్ చేర్చాడు. అక్కడినుంచి టైటాన్స్ పతనం ప్రారంభమైంది. 4వ ఓవర్‌లో ముకేష్ కుమార్.. సాహను బౌల్డ్ చేయగా, ఆ మరుసటి ఓవర్‌లో ఇషాంత్.. సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్‌లను ఔట్ చేశాడు. దీంతో గుజరాత్ 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అభినవ్ మనోహర్- రాహుల్ తెవాటియా జోడి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 

పంత్ మెరుపు కీపింగ్ 

నిలకడగా ఆడుతున్న ఈ జోడీని అభినవ్- తెవాటియా జోడీని పంత్ విడదీశాడు. ట్రిస్టన్‌ స్టబ్స్ వేసిన తొమ్మిదో ఓవర్‌ మూడో బంతికి మెరుపు వేగంతో స్టంపింగ్ చేసి అభినవ్‌ మనోహర్‌ను వెనక్కి పంపాడు. అదే ఓవర్ ఐదో బంతికి షారూఖ్‌ ఖాన్‌ (0)ను స్టంప్‌ ఔట్ చేశాడు. పంత్ కీపింగ్ దెబ్బకు టైటాన్స్ కోలుకోలేకపోయింది. చివరలో రషీద్ ఖాన్ పోరాడడంతో గుజరాత్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో రెండు.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.