
- మన ఎగుమతులు తగ్గే ప్రమాదం
- హెచ్చరించిన జీటీఆర్‌ఐ
న్యూఢిల్లీ: అమెరికా నుంచి జన్యుమార్పిడి (జీఎం) వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం కింద అనుమతులు ఇస్తే మనదేశం చాలా నష్టపోవాల్సి ఉంటుందని ఫైనాన్షియల్ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ఇనీషియేటివ్(జీటీఆర్‌ఐ) శనివారం హెచ్చరించింది. దీనివల్ల భారతదేశ వ్యవసాయ ఎగుమతులు తగ్గుతాయని, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌కు (ఈయూ) జరిగే ఎగుమతులపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది.
భారతదేశం, అమెరికా మధ్య జరుగుతున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఈనెల 9 లోపు ప్రకటించే అవకాశం ఉంది. జంతువుల దాణా కోసం సోయాబీన్ మీల్, డిస్టిలర్స్ డ్రైడ్ గ్రైన్స్ విత్ సొల్యూబుల్స్ (డీడీజీఎస్) వంటి జన్యు మార్పిడి (జీఎం) ఉత్పత్తుల దిగుమతిని అనుమతించడం వల్ల భారతదేశ వ్యవసాయ ఎగుమతులకు నష్టం వాటిల్లుతుందని జీటీఆర్‌ఐ పేర్కొంది. డీడీజీఎస్ అనేది ఇథనాల్ ఉత్పత్తి సమయంలో మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల నుంచి తయారయ్యే ఒక ఉప ఉత్పత్తి.
యూరప్‌లో స్ట్రిక్ట్ రూల్స్
ఈయూలో జీఎం ఉత్పత్తులకు కఠినమైన లేబులింగ్ రూల్స్, వినియోగదారుల నుంచి బలమైన వ్యతిరేకత ఉన్నాయి. జీఎం ఫీడ్‌కు అనుమతి ఉన్నా, చాలా మంది యూరోపియన్ కొనుగోలుదారులు పూర్తిగా జీఎం -రహిత ఆహార పదార్థాలను ఇష్టపడతారు. ఈ విషయమై జీటీఆర్‌ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, భారతదేశంలో వ్యవసాయ లాజిస్టిక్స్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మౌలిక సదుపాయాలు అరకొరగా ఉండటం వల్ల జీఎం, నాన్-జీఎం పంటలు కలిసే అవకాశం ఉందని అన్నారు.
దీనివల్ల ఎగుమతి చేసే సరుకులలో జీఎం అవశేషాలు చేరే ప్రమాదం ఉందన్నారు. ఫలితంగా ఎగుమతులను తిరస్కరించడానికి, అధిక పరీక్షా ఖర్చులకు, భారతదేశానికి ఉన్న "జీఎం-రహిత" గుర్తింపును దెబ్బతీయడానికి దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బియ్యం, టీ, తేనె, మసాలాలు, సేంద్రియ ఆహారాల వంటి సున్నితమైన రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
పటిష్టమైన ట్రేసబిలిటీ (వస్తువు ఎక్కడి నుండి వచ్చిందో గుర్తించే వ్యవస్థ) లేబులింగ్ వ్యవస్థలు లేనందున, జీఎం ఫీడ్ దిగుమతులు ఈయూలో భారతదేశ ఎగుమతి పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని శ్రీవాస్తవ వివరించారు.