గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతోన్నగుడాటిపల్లి

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతోన్నగుడాటిపల్లి
  • ఇవ్వాల్సిందే అంటూ గుడాటిపల్లి మహిళల పోరాటం

సిద్దిపేట, వెలుగు: వారంతా ఇక్కడే పుట్టి పెరిగారు.. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో ఇల్లు, పొలాలు కోల్పోయారు. దీంతో గ్రామంలోని యువతకు రూ. 8 లక్షల పరిహారం, డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇస్తామని ఆఫీసర్లు చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చారు. పెండ్లవడంతో యువతులు గ్రామంలో ఉండడం లేదని, వారు పరిహారానికి అనర్హులని అంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని అక్కన్నపేట మండలంలో నిర్మిస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంతో గుడాటిపల్లి గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతోంది. గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ. 8 లక్షలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేందుకు అధికారులు హామీ ఇచ్చారు. 2015 నుంచి 2021  అక్టోబరు 15 వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించారు. రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో  సర్వే చేసి 320 మంది యువత అర్హులని గుర్తించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంతో నిర్వాసితుల కోరిక మేరకు  కటాఫ్ తేదీని 2022 డిసెంబర్  31 వరకు పొడగించారు. కటాఫ్​ తేదీ పొడగించిన తరువాత మరో 70 మంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.  చర్చల సందర్భంగా యువతులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీకరించిన అధికారులు ఇప్పుడు రూల్స్​పేరుతో ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పెండ్లయిన యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చే విషయంపై ప్రభుత్వం సైతం అంగీకరించలేదని తెలుస్తోంది. గతంలో 2010 నుంచి 2015 వరకు 141 మంది 18 సంవత్సరాలు నిండినవారికి రూ. ఆరు లక్షల చొప్పున పరిహారాన్ని అందించారు. యువతులకు  పెండ్లైనా అప్పట్లో పరిహారాన్ని అందజేశారు.  రెండు సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వే  ప్రకారం  85 మంది యువతులకు పెండ్లయింది. కటాఫ్ తేదీని పొడగించడంతో మరో 30 మందితో కలుపుకొని మొత్తం 120  మంది పెండ్లయిన యువతులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు.  అయితే వీరంతా పెండ్లై స్థానికంగా ఉండటం లేదని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అనర్హులని తేల్చారు. ఆఫీసర్లు  ప్యాకేజీ ఇవ్వకపోవడంతో గుడాటిపల్లి వద్ద యువతులు  నిరసన దీక్షలు నిర్వహిస్తున్నారు.

పట్టించుకోని లీడర్లు, అధికారులు

సర్వే జరిపే నాటికి మైనర్లుగా ఉన్న తమ పేర్లను జాబితాలో  చేర్చారని, పరిహారం ఇచ్చే సమయానికి వివాహం జరిగిందంటూ ప్యాకేజీ ఇవ్వడంలేదని గుడాటిపల్లికి చెందిన 120 మంది యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల సీపీఐ నేత చాడ వెంకటరెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావుకు సైతం వినతిపత్రాలు సమర్పించారు. కానీ అధికారులు, లీడర్లు స్పందించకపోవడంతో ఊరిలో ఏర్పాటు చేసిన శిబిరంలో నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. గ్రామంలో పుట్టి పెరిగి పెండ్లి చేసుకుని వెళితే తమకు పరిహారం ఎందుకు ఇవ్వరని, గతంలో పెండ్లయిన వారికి ఇచ్చి ప్రస్తుతం ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండగ తరువాత దీనిపై చర్చిద్దామని అధికారులు పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పనులను అధికారులు పోలీసు పహారాలో చకచకా సాగిస్తున్నారు. కుందనివారిపల్లె వద్ద పనులు ముగించుకుని రామవరం రోడ్డులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఆఫీసర్లు మాట నిలబెట్టుకోవాలి

గుడాటిపల్లిలో సర్వే సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామన్న హామీని అధికారులు నిలబెట్టుకోవాలి. ఆఫీసర్లు కటాఫ్ తేదీ ప్రకారం గ్రామానికి చెందిన యువతుల జాబితా రూపొందించారు. పెండ్లి చేసుకుని వెళ్లిపోయారనే కారణంతో ఇప్పుడు ప్యాకేజీ ఇవ్వలేమని చెప్పడం తగదు. 2015 వరకు పెండ్లయిన యువతులకు పరిహారం ఇచ్చి ఇప్పుడు రూల్స్​అడ్డు వస్తున్నాయని చెప్పడం అన్యాయం. ఇప్పటికైనా యువతులకు ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలి. 

– రాజిరెడ్డి, సర్పంచ్, గుడాటిపల్లి

జాబితా ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలి

గతంలో అధికారులు గుడాటిపల్లిలో  నిర్వహించిన సర్వే జాబితా ప్రకారం 18 సంవత్సరాలు నిండిన యువతులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. పెండ్లి చేసుకుని స్థానికంగా ఉండటం లేదనడం సమంజసం కాదు. ఇక్కడే పుట్టి పెరిగిన యువతులకు అన్యాయం చేయడం తగదు.

– కవిత, గుడాటిపల్లి  

మాట మార్చడం తగదు

ప్రాజెక్టు నిర్మాణంతో ఇల్లు వాకిలి కోల్పోయి కుటుంబాలు చెల్లాచెదురైనందున ఆఫీసర్లు మానవతా థృక్పథంతో వ్యవహరించాలి. గతంలో 18 సంవత్సరాలు నిండిన యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం తగదు. ఆఫీసర్ల చర్యల వల్ల గ్రామానికి చెందిన దాదాపు వంద మందికి పైగా యువతులకు ప్యాకేజీ అందని పరిస్థితి ఏర్పడింది. 

– చెంచు మాధవి, గుడాటిపల్లి