దివ్యాంగులు, ట్రాన్స్​జెండర్లకు 100 రోజులు ఉపాధి!

దివ్యాంగులు, ట్రాన్స్​జెండర్లకు 100 రోజులు ఉపాధి!
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గైడ్​లైన్స్
  • వెనుకబడిన జిల్లాలు 3,మండలాలు 10
  • సగటు కంటే ఎక్కువ పని దినాలు కల్పించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: దివ్యాంగులు, ట్రాన్స్​జెండర్లకు ఉపాధి హామీ కింద సగటు కంటే ఎక్కువ పని దినాలు కల్పించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. నీతి ఆయోగ్ ప్రకారం అత్యంత వెనుకబడిన జిల్లాలు, మండలాలు, క్లస్టర్ ఫెసిలిటేషన్ ప్రాజెక్ట్ (సీఎఫ్​పీ) మండలాలు, అంతరించిపోతున్న ఆదిమ తెగలు, అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్​ఆర్) 2006 కింద భూమి పట్టా ఉన్నోళ్లు, మహిళా ఆధారిత కుటుంబాలపై ప్రత్యేక దృష్టిసారించాలని పేర్కొన్నది. 

వార్షిక మాస్టర్ సర్క్యులర్ లో తెలిపినట్లుగా దివ్యాంగులకు 100 రోజుల పని కల్పించాలని తెలిపింది. నర్సరీలు, ప్లాంటేషన్లలో బాచ్, వార్డ్ వంటి పనులు, నీళ్లు పెట్టడం, నర్సరీల్లో వన సేవకులుగా, వాటరింగ్ పనులు చేసే వెసులుబాటు కల్పించాలని సూచించింది. 

దివ్యాంగ కూలీలు ఎవరిపై ఆధారపడకుండా ప్రయాణించే ప్రాంతాల్లో సులభంగా చేయగలిగే పనులను కేటాయించాలి. గ్రామంలో ఇద్దరు కంటే ఎక్కువ మంది ట్రాన్స్ జెండర్లు ఉంటే వారిద్దరికీ ఒకే ప్రదేశంలో పని కల్పించాలి. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించకపోయినా.. సమస్యలపై గ్రామీణాభివృద్ధి శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1800-200-1001కు ఫోన్ చేసి ఫిర్యాదును రిజిస్ట్రేషన్ చేయవచ్చు’’అని పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది.

వెనుకబడిన జిల్లాలు, మండలాలపై ఫోకస్ 

నీతి ఆయోగ్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 112 జిల్లాలో అభివృద్ధిలో వెనుకబడ్డాయి. వీటిలో తెలంగాణ నుంచి భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 500 అత్యంత వెనుకబడిన మండలాలను గుర్తించారు. తెలంగాణలో 10 మండలాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్, భద్రాద్రి జిల్లాలో గుండాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముత్తారం, మహాదేవపూర్, పలిమెల, జోగులాంబ గద్వాలలో గట్టు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాణి, మహబూబాబాద్ జిల్లాలో గంగారం, ములుగులో కన్నాయిగూడెం, నారాయణపేటలో సర్వ, నిర్మల్​లో పెంబి మండలాలున్నాయి. అత్యంత వెనుకబడిన జిల్లాలు, మండలాల్లో జాబ్ కార్డుదారులకు రాష్ట్ర, జాతీయ సగటు కంటే ఎక్కువ పనిదినాలను కల్పించాలి.