జడ్పీ ఉద్యోగుల విభజనపై విడుదలకాని గైడ్ లైన్స్

జడ్పీ ఉద్యోగుల విభజనపై విడుదలకాని గైడ్ లైన్స్
  • వచ్చే నెల 5 నుంచి కొత్త జడ్పీల పాలన
  • ఉద్యోగుల విభజనపై ఇప్పటికీ విడుదలకాని గైడ్ లైన్స్
  • ఆర్థిక శాఖ క్లియరెన్స్ కోసం పీఆర్ శాఖ వెయిటింగ్
  • ఆప్షన్లు తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలంటున్న ఉద్యోగులు
  • వారంలో ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లు మనుగడలోకి రానున్నాయి. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లు ఉండగా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జడ్పీల పదవీకాలం ఆగస్టు 5 వరకూ ఉంది. మిగతా 28 జడ్పీల ప్రారంభానికి మరో 15 రోజులే సమయం ఉంది. అయితే ఇప్పటి వరకూ జడ్పీ ఉద్యోగుల విభజనకు సంబంధించి గైడ్​లైన్స్​ విడుదల కాలేదు. విభజనకు సంబంధించి ఆప్షన్లు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల విభజనతోపాటు ఆస్తులు, నిధుల విభజనపై వారంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక శాఖకు ఫైలు

ప్రస్తుతం 9 జడ్పీల్లో 500 మంది పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్ల నుంచి సూపరింటెండెంట్ల వరకూ ఉన్నారు. అకౌంటెంట్లు, డిప్యూటీ సీఈవోలు, సీ ఈవోలు అదనంగా ఉన్నారు. మరో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే 32 జడ్పీలకు సర్దుబాటు చేయనున్నట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల విభజనపై క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. క్లియరెన్స్​ రాగానే విభజన ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జులై 3న ఉద్యోగులు విధుల్లో చేరేలా వారంలో ప్రక్రియ పూర్తి చేయటానికి కసరత్తు చేస్తున్నారు.

కొలిక్కి వచ్చిన భవనాలు

ప్రస్తుతం ఉన్న 9 జడ్పీలకు సొంత భవనాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల ఎంపిక చివరిదశకు చేరిందని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల ప్రభుత్వ భవనాల్లోనే జడ్పీ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం తర్వాత భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

గైడ్​లైన్స్​  ప్రిపేర్​ చేస్తున్నాం

జడ్పీ ఉద్యోగుల విభజనపై గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆర్థిక శాఖకు ఫైల్ పంపాం. అప్రూవల్ రావలసి ఉంది. రాగానే ప్రక్రియ ప్రారంభిస్తాం. ఉన్న సిబ్బందినే సర్దుబాటు చేసే యోచనలో ఉన్నాం. అదనపు సిబ్బంది అవసరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తాం.  – వికాస్ రాజ్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి

ఆప్షన్లు తీసుకుని పోస్టింగ్​ ఇవ్వాలి

ఇంత వరకు గైడ్ లైన్స్ విడుదల కాలేదు. పాత జడ్పీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుని పోస్టింగ్ ఇవ్వాలి. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి ఏర్పడిన జడ్పీల్లో పోస్టింగ్ ఇస్తే పని చేసేందుకు సిద్ధమే. ఆర్డర్ టు సర్వ్ ప్రాతిపదికన పోస్టింగ్ ఇవ్వొద్దు. – శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ యూనియన్