
ఆదిలాబాద్ జిల్లా: ప్రభుత్వ నకిలీ పత్రాలు, ప్రభుత్వ నకిలీ స్టాంపులు తయారు చేస్తున్న బ్యాచ్ బాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ పలు శాఖల నకిలీ పత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ స్టాంపులు, నకిలీ పత్రాలు తయారు చేసి నిందితులు ప్రజలను మోసగిస్తున్నారు. అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులతో నకిలీవి తయారీ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో డాక్యుమెంట్లు సృష్టించినట్లు పోలీసుల దర్యా్ప్తులో తేలింది. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో నకిలీ పత్రాల స్టాంపులు సృష్టిస్తున్న తండ్రీకొడుకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ,రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ కౌన్సిల్లకు సంబంధించిన నకిలీ పత్రాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కంప్యూటర్, స్కానర్, హార్డ్ డిస్క్లు.. ఈ స్కాం చేయడానికి వినియోగించిన పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టాంపు పరికరాలు, ఖాళీ స్టాంపులు, స్టాంపునకు వినియోగించే పేపర్లు, ఖాళీ డాక్యుమెంట్లు సీజ్ చేశారు. పలు జిల్లాలకు సంబంధించిన వివిధ శాఖల నకిలీ పత్రాలను నిందితులు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.