ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ లేక గందరగోళం

ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ లేక గందరగోళం
  • పోస్టింగ్ లపై కొరవడిన క్లారిటీ
  • ఆందోళనలో 5,400 మంది

వీఆర్వోలను వివిధ డిపార్ట్​మెంట్లలో సర్దుబాటు చేసిన సర్కారు వారి జీతం విషయాన్ని మాత్రం మరిచింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న వీఆర్వోలను ప్రభుత్వం వివిధ శాఖలలో అడ్జెస్ట్ చేసింది. కానీ వారి జీతాల చెల్లింపునకు మాత్రం సరైన గైడ్ లైన్స్ ఇవ్వలేదు. దీంతో ఈ నెల జీతాలు రాక  ఇబ్బందులు పడుతున్నారు. ఆయా శాఖల అధికారులను అడిగితే తమకు చేర్చుకోవాలనే ఆదేశాలు తప్ప, జీతాలు చేసేందుకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తేనే జీతాలు చెల్లిస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో వారి పరిస్థితి గందరగోళంగా తయారైంది.

సూర్యాపేట, వెలుగు: రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది. అప్పటినుంచి రాష్ట్రంలోని 5,485 మంది వీఆర్వోలు తహసీల్దార్​ఆఫీసుల్లో డ్యూటీ చేశారు. డిపార్ట్​మెంట్​లలో ఖాళీగా ఉన్న  జూనియర్ అసిస్టెంట్ కు సమానమైన పోస్టుల్లో వీ‌ఆర్వోలను లక్కీడిప్ ద్వారా సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఇటీవల జీవో నంబర్ 121 విడుదల చేసింది. ఆ ప్రకారం వీఆర్వోలను వివిధ డిపార్ట్​మెంట్​లలో సర్దుబాటు చేశారు. సూర్యాపేట జిల్లాలోని 35 డిపార్ట్​మెంట్​లలో 209 మంది వీఆర్వోలకు లాటరీ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు. జిల్లాలో పోస్టులు లేకుంటే పక్క జిల్లాల్లో ఇవ్వాలని జీవోలో పేర్కొన్నప్పటికీ సూర్యాపేటలో మాత్రం అమలు చేయలేదు. మున్సిపాలిటీ, హెల్త్ డిపార్ట్​మెంట్​లలో పోస్టులు ఖాళీగా లేనప్పటికీ క్రియేటెడ్ పోస్టుల పేరుతో సర్దుబాటు చేశారు. మున్సిపాలిటీలో పనిచేసే వీఆర్వోలను వార్డ్ ఆఫీసర్ గా నియమించారు. హెల్త్ డిపార్ట్​మెంట్​కు ఉన్న పోస్టుల కంటే ఎక్కువ మందిని కేటాయించడంతో కొంతమంది వీఆర్వోలకు ఎలాంటి డ్యూటీలను  అప్పగించలేదు. నెల రోజులపాటు  ఖాళీగా ఉన్నవారిని ఇటీవలే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు  కేటాయించారు. 

హోదాపై క్లారిటీ వస్తేనే..

ప్రభుత్వం నుంచి సరైన గైడ్ లైన్స్ లేకపోవడం, శాంక్షన్ పోస్టులు లేకపోవడంతో ఇప్పుడు జీతాల బిల్లులు చేయడం ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. వీ‌ఆర్వోలను డిపార్ట్​మెంట్లకు కేటాయించినప్పటికీ వారి హోదాలపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో జీతాల కోసం ఆయా కమిషనర్లకు లెటర్లు పెట్టినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో గురుకులంలో చేరిన 51 మంది వీ‌ఆర్వోలకు బడ్జెట్ కేటాయించలేదు. మున్సిపాలిటీ లో క్యాడర్ స్ట్రెంత్ ప్రకటన చేయకపోవడంతో వార్డ్ ఆఫీసర్ పేరుతో పోస్ట్ క్రియేట్ చేసి వీఆర్వోలను సర్దుబాటు చేశారు. కానీ వార్డ్ ఆఫీసర్ పోస్ట్ లేకపోవడంతో జీతాలను ఎలా చేయాలో తెలియక ఆఫీసర్లు అయోమయంలో ఉన్నారు.  ఇప్పటికే డ్యూటీ కేటాయించి నెల రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ పై స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం నుంచి శాంక్షన్ పోస్టులపై క్లారిటీ వస్తేనే బిల్లులు చేసి ట్రెజరీలకు పంపాల్సి ఉంటుంది. దీంతో జీతాల కోసం వీఆర్వోలు ఆందోళన చెందుతున్నారు. 

పోస్ట్ లేదంటూ జీతాలు చేయలే

వార్డ్ ఆఫీసర్ పోస్ట్ ఏపీలో ఉంది కానీ తెలంగాణలో లేదు. శాంక్షన్ పోస్ట్ కాకపోవడంతో జీతాలను ఎలా చేస్తామని ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వస్తేనే జీతాలు వస్తాయంటున్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో మేం ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించాలి.  

- రమేశ్, వీఆర్వో, సూర్యాపేట జిల్లా 

గైడ్ లైన్స్ రాలేదు

వీఆర్వోల జీతాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదు. త్వరలోనే వీఆర్వోల బిల్లులను పూర్తి చేసి ట్రెజరీకి పంపిస్తాం. 

- బైరెడ్డి సత్యనారాయణ, 
మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట