మిస్టరీ ఏంటీ : పిల్లలతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య

మిస్టరీ ఏంటీ : పిల్లలతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య

అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబం.. వ్యాపారంలో బాగానే లాభాలు వస్తున్నాయి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆ వ్యాపారి ఆనందంగా నే ఉన్నాడు. కొంతమందికి అప్పులు ఇవ్వడమే అతని కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. లక్ష ల్లో అప్పులు ఇచ్చారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వడంలోజాప్యం చేశారు.. చాలా మంది ఇవ్వకుండా మొండికేశాడు.. దీంతో ఆ కుంటుంబం ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. వారికి ఆత్మహత్యే శరణ్యమైంది... ఏడుగురు కుటుంబ సభ్యులు తెల్లారేసరికి విగతజీవులయ్యారు. కుటుంబం మొత్తం ఊకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఆ ప్రాంతమంతా. శనివారం (అక్టోబర్28) గుజరాత్ లో ఓ వ్యాపార వేత్త కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను తాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వ్యాపారి.. వివరాల్లోకి వెళితే.. 

 గుజరాత్: సూరత్ లోని పాలన్ పూర్ పాటియా ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో ఫర్నీచర్ వ్యాపారి మనీష్ సోలంకి కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాదఘటనలో మనీష్ తో పాటు అతని ముగ్గురు పిల్లలు, భార్య, తల్లిదండ్రులు మరణించినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారి మనీష్ సోలంకి తన ముగ్గురు పిల్లలకు, తల్లిద్రండులకు, భార్యకు విషమిచ్చి తాను విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అప్పు తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువకావడంతో మనీష్ సోలంకి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మృతులు మనీష్ సోలంకి(35) అతని భార్య రీటా(32), వారి పిల్లలు దిశ(7), కావ్య(5), ఖుషాల్(3) మృతదేహాలను పడకగది లో గుర్తించారు పోలీసులు.. మిగిలిన రెండు మృతదేహాలు మనీష్ తల్లిదండ్రులు కాంతిలాల్(65), శోభన(60) గా గుర్తించారు. 

మనీష్ సోలంకి అమ్రేలీ జిల్లా లోని సావర్కుండ్లాకు చెందినవారు.. గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి సూరత్ లో నివసిస్తున్నాడు. పాటియా ప్రాంతంలోని ఓ భవనంలో నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్నారు. మనీష్ అనేక మందికి అప్పులు ఇచ్చాడు. దీపావళి పండుగ దగ్గరపడుతున్నందున రుణాలు తిరిగి చెల్లించమని అభ్యర్థించాడు. అయినప్పటికీ అతని రుణగ్రహీతలు ఇవ్వకపోవడం, కొందరు పూర్తిగా ఇవ్వకుండా ఎగవేయడంతో మనీష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.