దారితప్పిన నిరసన: పోలీసుల్ని కార్నర్ చేసి రాళ్ల వర్షం.. వీడియో

దారితప్పిన నిరసన: పోలీసుల్ని కార్నర్ చేసి రాళ్ల వర్షం.. వీడియో

పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు దారితప్పాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తెలపాల్సిన నిరసనల్లో హింస చెలరేగింది. గురువారం దేశవ్యాప్తంగా విపక్షాలు CAAకు వ్యతిరేకంగా నిరసనలు చేశాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని షా-ఎ-అలామ్ ప్రాంతంలో చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసకు దారి తీశాయి. నిరసన వ్యక్తం చేస్తున్నారా? లేక పోలీసులపై హత్యయత్నమా అన్నంత దారుణం దాడికి దిగారు నిరసనకారులు. పోలీసుల్ని చుట్టుముట్టి వందల మంది రాళ్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ వీడియో వైరల్ అవుతోంది.

షా-ఎ-అలామ్ ప్రాంతంలో గురువారం దాదాపు 2 వేల మంది నిరసనకారులు గుమ్మిగూడారు. నో క్యాబ్, నో ఎన్‌ఆర్సీ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతగా వచ్చి పోలీసులపైనే ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పోలీసులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ షాప్ దగ్గర కార్నర్‌లోకి వెళ్లి దాక్కునే ప్రయత్నం చేశారు. అయినా రాళ్ల వర్షం ఆపలేదు నిరసనకారులు.

పోలీసులకు రక్షణ కల్పించే ప్రయత్నం

నిరసన దారితప్పిన ఆ సమయంలో కొద్ది మంది ఆందోళనకారులు, స్థానికులు పోలీసులకు రక్షణగా ముందుకొచ్చారు. రాళ్లు వేయొద్దంటూ నిరసనకారుల్ని బతిమిలాడారు. కానీ వాళ్లు ఆగకపోవడంతో ప్లాస్టిక్ బాక్సులు, బల్లలను పట్టుకుని పోలీసులను కవర్ చేస్తూ రక్షణగా నిలబడ్డారు. అంతలో నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసు బలగాల వచ్చాయి. టియర్ గ్యాస్ ప్రయోగించడంతో ఆ జనమంతా వెళ్లిపోయారు.

19 మంది పోలీసులకు గాయాలు

ఈ ఘటనలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్బీ రానా సహా 19 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, ఇప్పటికే 32 మందిని గుర్తించామని చెప్పారు పోలీసులు. మిగిలిన వారిని కూడా కనిపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.