విశాఖ‌లో గ్యాస్ లీకేజీ కంట్రోల్ కు గుజ‌రాత్ సాయం

విశాఖ‌లో గ్యాస్ లీకేజీ కంట్రోల్ కు గుజ‌రాత్ సాయం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విశాఖ‌ప‌ట్నంలో గురువారం ఉద‌యం పెను విషాదం చోటు చేసుకుంది. గురువారం తెల్ల‌వారుజామున మూడున్న‌ర గంట‌ల స‌మ‌యంలో సిటీ స‌మీపంలోని వెంక‌టాపురం ప్రాంతంలో ఉన్న ఎల్జీ పాలిమ‌ర్స్ కంపెనీలో స్టైరిన్ అనే విష‌వాయువు లీక్ అయింది. ఈ గ్యాస్ లీకేజీ కార‌ణంగా చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో గాలి విష‌పూరితంగా మారి ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది మ‌ర‌ణించ‌గా.. వంద‌లాది మంది ఆస్ప‌త్రిపాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌కు కంపెనీ నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని, లాక్ డౌన్ స‌మ‌యంలో స‌రైన మైంటెనెన్స్ చేప‌ట్ట‌క‌పోవ‌డం వ‌ల్ల పాలిమ‌రైజేష‌న్ జ‌రిగి ఈ ఘోరం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింది.

జ‌గ‌న్ ఫోన్.. గుజ‌రాత్ సీఎం సాయం

ఎల్జీ పాలిమ‌ర్స్ లో కంపెనీలో స్టైరిన్ గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేయ‌డంలో గుజ‌రాత్ ప్ర‌భుత్వం సాయం చేసింది. పాలిమ‌రైజేష‌న్ ను నిరోధించి గ్యాస్ లీకేజీని న్యూట్ర‌లైజ్ చేసేందుకు ఉప‌యోగించే కెమిక‌ల్.. పారా టెరిష్య‌రీ బ్యూటైల్ కాటెకోల్ (పీటీబీసీ)ని గుజ‌రాత్ లోని వాపి నుంచి హుటాహుటీన పంపేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ. వాపీలోని కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీల నుంచి 500 కిలోల పీటీబీసీ కెమిక‌ల్ ను 21 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న డామ‌న్ కు పంపి అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో విశాఖప‌ట్నానికి పంపిన‌ట్లు తెలిపారు గుజ‌రాత్ సీఎంవో సెక్రెట‌రీ అశ్వ‌నీ కుమార్. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఫోన్ చేసి గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీని రిక్వెస్ట్ చేయ‌డంతో హుటాహుటీన ఈ ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.