‘గే’లుగా మారుతున్న సింహాలు

‘గే’లుగా మారుతున్న సింహాలు

ఫ్యామిలీలు ఉన్నా మగ సింహాల ‘గే’ చూపులు

ఆడ సింహాలదీ ఇదే దారి

చూడప్పా సిద్ధప్పా నేను సింహం లాంటోణ్ని..’ అని సరదాగా సినిమా డైలాగులు చెబుతుంటాం. కానీ గుజరాత్ గిర్ ఫారెస్ట్ లోని సింహాలు మాత్రం ‘‘చూడప్పా సిద్ధప్పా ‘ఆ’ విషయంలో మేమూ మనుషుల్లాంటోళ్లమే..’’ అన్నట్లు ప్రవర్తిస్తున్నాయట. మామూలుగా అయితే సింహాలు మనుషుల్లాగే ఫ్యామిలీతో సహా గుంపులుగా నివసిస్తాయి. వీటి గుంపును ప్రైడ్ అని పిలుస్తారు. ఒక్కో ప్రైడ్ సుమారు70, 80 చ.కి.మీ. అడవిని ఆక్రమించుకుని, ఆ టెరిటరీలోకి ఇతర సింహాలు, పులుల వంటి వాటిని రాకుండా తరిమేస్తూ అడవినేలుతుంటాయి. అయితే గిర్ ​ఫారెస్ట్​లోని మగ సింహాలు స్వలింగ సంపర్కం జరుపుతున్న సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ సుమారు ఏడు గే సింహాల జంటలను తాము చూసినట్లు వారు అంటున్నారు. గిర్​ ఫారెస్టులో1973, 1999, 2016, 2017లోనూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయని వారు పేర్కొంటున్నారు.

గొడవ పడొద్దని వదిలితే.. ‘గే’లయ్యాయ్ 

గిర్​ ఫారెస్ట్ లోని దేవాలియా జోన్లో మగ సింహాల మధ్య గొడవలు రాకూడదని రెండు మగ సింహాలను ఒక విడతలో, రెండు ఆడ సింహాలను మరో విడతలో పిల్లలతో సహా వేర్వేరుగా విడుదల చేశారు. అయితే రెండు రోజులయ్యేసరికి మగ సింహాలు రెండూ రొమాన్స్ లో పడ్డాయట. అవి రెండూ కలిసి 70 చ.కి.మీ. ప్రాంతాన్ని సొంతం చేసుకుని ఏడాదిన్నర పాటు ఆ ప్రాంతాన్ని ఏలాయని డాక్టర్ జల్పాన్ రుపాపరా అనే సైంటిస్ట్ వెల్లడించారు.

మగ సింహాల రొమాన్స్‌

గిర్​ఫారెస్ట్ లోని ఖోఖ్రా ఏరియాలో 1999లోనూ ఒక ఆసక్తికరమైన కేసు నమోదైందని అప్పటి ప్రిన్సిపల్ చీఫ్​కన్సర్వేటర్ బి.పి. పటీ వెల్లడించారు. ఆడ సింహాలు, పిల్లలు ఉన్నప్పటికీ రెండు మగ సింహాలు రొమాన్స్ లో పడ్డాయని ఆయన తెలిపారు. ఇవి ససాన్ వద్ద 70 చ.కి.మీ. ప్రాంతాన్ని సొంతం చేసుకుని, ఏడాది పాటు ఆధిపత్యం చెలాయించాయన్నారు. వీటికి నాలుగు ఆడ సింహాలు, పిల్లలు కూడా ఉన్నాయని చెప్పారు. సాధారణంగా సింహాలు జత కట్టే రోజుల్లో తిండి మానేస్తాయని, ఇవి కూడా తిండి మానేశాయన్నారు. అంతేకాకుండా.. ఆడ సింహాలతో జత కట్టేటప్పటి ప్రవర్తనకు భిన్నంగా ఇవి వాటి ప్లేస్ ను చేంజ్ చేసి, మరుగుకు వెళ్లి మరీ జత కట్టాయని వివరిస్తూ బి.పి. పటీ ‘బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ’ జర్నల్‌లో ఆర్టికల్ రాశారు.

మృగరాణులూ..  ఇదే బాటలో!

గిర్ ఫారెస్ట్ లో మగ సింహాలు మాత్రమే కాదు.. కొన్ని సార్లు ఆడ సింహాలు (సివంగులు) కూడా ఒకదాని పట్ల ఒకటి ఆకర్షణకు గురవుతున్నట్లు కూడా కొందరు చెబుతున్నారు. ఇక్కడ ఆడ సింహాల రొమాన్స్ ను కూడా తాను గతంలో చూశానని సనత్ చౌహాన్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ చెబుతున్నారు. ‘‘గిర్ ఫారెస్ట్ లోని సింహాలు ఆసియా సంతతికి చెందినవి. వీటిలో సొంత టెరిటరీలు ఏర్పాటు చేసుకుని, వాటిని ఏలే మగ సింహాలు ఇలా స్వలింగ సంపర్కం పట్ల ఆకర్షణకు గురికావడం అనేది చాలా అరుదైన విషయం. అలాగే వీటి రొమాన్స్ గురించి గతంలో చాలామంది చెప్పడమే కానీ పెద్దగా ఆధారాలు లేవు.  కానీ 1982లో తొలిసారిగా ఖోఖ్రా ఏరియాలో 6 నుంచి 7 ఏండ్ల వయసున్న రెండు మగ సింహాలు వాటి చెంతన ఆడ సింహాలు లేనప్పుడు రొమాన్స్ చేయడం నేను చూశాను. ఆ గే సింహాల రొమాన్స్ ను నేను ఫొటోలతో సహా రికార్డ్ చేశాను” అని చౌహాన్ పేర్కొన్నారు.