
అప్పుడే డ్యూటీ నుంచి వచ్చిండు. మస్తు పని చేసి అలసిపోయిండు. అట్ల పడుకున్నడో లేదో ఇట్ల నిద్ర పట్టింది. కానీ మధ్యమధ్యలో ఒకటే అరుపులు. అటూ ఇటూ బొర్లినా వశంగాలె. ‘ఏందిరబై ఈ లొల్లి’ అని లేచిండు. అటూ ఇటూ చూసిండు. యాడ నుంచి సౌండొస్తుందో అర్థంగాలె. పిల్లి అరుపేమో అనుకున్నడు. నిద్ర మత్తులనే వెతుకుతున్నడు. సౌండ్ బాత్రూంల నుంచి వస్తుందని పోయిండు. డోర్ తీసిండు. అంతే. బొమ్మ చూసేసరికి నిద్రమత్తు వదిలింది బాబుకు. ఉన్నకాడి నుంచి మూడడుగులు ఎనక్కి దుంకిండు. బాత్రూంలో మొసలి కనవడ్తే ఆ మాత్రం భయపడరా మరి. గుజరాత్‌లోని వడోదరలో గతవారం జరిగిందీ సంఘటన. ఆ ఇంటి ఓనర్ పేరు మహేంద్ర పధియార్. మీటరున్నర పొడవుందా క్రొకడైల్. వెంటనే వైల్డ్‌లైఫ్ రెస్క్యూ ట్రస్ట్‌కు ఫోన్ చేశాడు మహేంద్ర. వాళ్లు పొద్దున 2.45కు ఇంటికొచ్చారు. అసలే పెద్దగా ఉందా మొసలి. పైగా కోపంగా ఉంది. గంటసేపు కష్టపడి పట్టుకోవాల్సి వచ్చింది. దగ్గర్లోని విశ్వామిత్ర నది నుంచి మొసలి ఇంట్లోకి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మొసళ్లు ఎక్కువుండే ఈ నదికి దగ్గరున్న ఇండ్లల్లో ఇట్లాంటి సంఘటనలు సర్వసాధారణమని రెస్క్యూ టీం చెప్పింది.