SRH vs GT: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే మరో ఆసక్తికర పోరుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో కాసేపట్లో (2026, మే 12న) తలపడనుంది. ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోవడంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది.
ఇరు జట్ల బలాబలాలు:
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ సారథ్యంలో గుజరాత్ జట్టు ఈ సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ, ఆ తర్వాత వరుస విజయాలతో పుంజుకుంది. రాజస్థాన్ రాయల్స్‌పై 77 పరుగుల భారీ విజయం సాధించి మంచి జోరులో కనిపిస్తుంది. గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్ లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. సిరాజ్, కగిసో రబడా, రషీద్ ఖాన్‌లతో కూడిన బౌలింగ్ విభాగం కూడా ప్రత్యర్థులకు సవాలు విసురుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పంజాబ్ కింగ్స్‌పై 235 పరుగుల భారీ స్కోరు చేసి 33 రన్స్ తేడాతో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్, బ్యాటింగ్‌లో భీకరంగా కనిపిస్తోంది. పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్, గుజరాత్ జట్లు తలో 14 పాయింట్లతో సమానంగా ఉండటంతో, నెట్ రన్ రేట్ కీలకం కానుంది. ఆరెంజ్ ఆర్మీ జట్టు బౌలింగ్ కాస్త కలవర పెడుతున్నప్పటికీ, కీలక సమయాల్లో బౌలర్లు అద్భుతం చేస్తుండటంతో.. గుజరాత్ ని ఓడించాలని టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
ఐపీఎల్ టోర్నమెంట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇప్పటి వరకు 7 మ్యాచులు జరిగాయి. ఈ పోరులో గుజరాత్ పైచేయి సాధించింది. ఆరెంజ్ ఆర్మీపై 5 మ్యాచులలో గెలివగా, సన్‌రైజర్స్ కేవలం ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది. ఇక ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్:
ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని పిచ్ నంబర్ 5పై జరగనుంది. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 199 పరుగులు చేయగా, గుజరాత్ కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయ్యింది. గత రెండు మ్యాచ్‌లను గమనిస్తే, ఇక్కడ భారీ స్కోర్లు మాత్రం నమోదు కాలేదు. కాబట్టి, టాస్ గెలిచిన జట్టు పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడం కీలకం కానుంది. ఈ మ్యాచులో విజయం సాధించిన జట్టే టేబుల్ టాపర్ గా నిలిచే అవకాశం ఉంది. మరీ ఏ టీమ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ ని కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.
