సీఎం రేవంత్​తో గల్ఫ్ జేఏసీ నేతల భేటీ

సీఎం రేవంత్​తో గల్ఫ్ జేఏసీ నేతల భేటీ
  •  గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్​గ్రేషియాపై కృతజ్ఞతలు

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ గల్ఫ్ కార్మికుల జేఏసీ బృందం సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం కలిసింది. గల్ఫ్ దేశాలలో చనిపోయిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా ఇస్తుండటంపై సీఎంకు జేఏసీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే శ్రీకారం చుట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. 

అనంతరం పీసీసీ ఎన్ఆర్ఐ చైర్మన్ బీఎం వినోద్ కుమార్ మాట్లాడారు. గల్ఫ్ కార్మికుల పట్ల సీఎం మానవత్వంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీకి, గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ, హైదరాబాద్‌‌లో ఈ నెల 15 తర్వాత గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సీఎం  రేవంత్ సమావేశం అవుతారని తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ నెలాఖరు వరకు గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తారని చెప్పారు.