
హైదరాబాద్, వెలుగు: గల్ఫ్‌లో చిక్కుకున్న 39 మంది బాధితులు స్వదేశానికి తిరిగొచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఇళ్లకు చేరి ఊపిరి పీల్చుకున్నారు. కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 60 మంది కార్మికులు పొట్ట చేతబట్టుకుని సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ జే అండ్ పీ అనే నిర్మాణ సంస్థలో పనికి కుదిరారు. ఆరు నెలల దాకా అంతా బాగానే ఉంది. జీతాలు బాగానే వచ్చాయి. కానీ, కంపెనీని వేరే వాళ్లకు అమ్మడంతోనే వాళ్ల కష్టాలు మొదలయ్యాయి. కొత్త యాజమాన్యం వారికి చుక్కలు చూపించింది. జీతాలు కాదు కదా కనీసం తిండి కూడా పెట్టకుండా వేధించింది. దీంతో వాళ్లు తమ గోడును ట్విట్టర్లో కేటీఆర్‌కు చెప్పుకున్నారు. విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృష్టికి తీసుకెళ్లారు. వారిని స్వదేశానికి పంపించేలా సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. ఎంబసీ అధికారులు ఆయా కార్మికులను గుర్తించింది. వర్క్ పర్మిట్ గడువు ముగియడంతో ఎగ్జిట్ వీసాలను ఏర్పాటు చేసి, టికెట్లు కొనిచ్చి ఇండియాకు పంపించింది.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్ఆర్ఐ శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను రిసీవ్ చేసుకుని, వారి వారి ఊళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టులో వారిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నాళ్లు కంపెనీ ఓనర్లు నరకం చూపించారని, తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక అవస్థలు పడ్డామని ఆవేదన చెందారు. తాము ఇండియాకు తిరిగి రావడంలో కేటీఆర్ మరచిపోలేని సాయం చేశారని గల్ఫ్ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. కేటీఆర్ చొరవతో ఇండియాకు వచ్చిన తాము ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. ప్రభుత్వం తమకు ఉపాధి కల్పించేలా ఆదుకోవాలని కోరారు. వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేలా సాయం చేయాలని కోరారు. కార్మికులను స్వదేశానికి పంపించిన సౌదీలోని భారత రాయబార కార్యాలయానికి, ఎన్ఆర్ఐ శాఖ అధికారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.