గల్ఫ్​ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి

గల్ఫ్​ కార్మికుల కోసం ప్రవాసీ ప్రజావాణి
  • ప్రజాభవన్​లో స్పెషల్​ కౌంటర్​
  • బాధితులకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా: పొన్నం ప్రభాకర్

పంజాగుట్ట, వెలుగు: గల్ఫ్ బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. విదేశాల్లో ఉంటూ అనుకొని సంఘటనల్లో కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గుతున్న తెలంగాణ వాసుల కోసం ప్రజాభవన్​లో స్పెషల్ కౌంటర్​ ఏర్పాటు చేసింది. శుక్రవారం బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావ్ ఫూలే ప్రజాభవన్​లో మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ప్రవాసీ ప్రజావాణి’ పేరుతో ఈ ప్రత్యేక కౌంటర్​ను ప్రారంభించారు. తర్వాత పొన్నం మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్​లో అనుకోని ఘటనల్లో కేసులు ఎదుర్కొని జైళ్లలో మగ్గుతున్న వారిని ఎంబసీ ద్వారా ఇండియాకు తీసుకు వస్తామని, అక్కడ మృతిచెందితే కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. 2023 డిసెంబరు 9 తర్వాత గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వారందరికీ రూ.5 లక్షలు ఎక్స్​గ్రేషియా వర్తిస్తుందన్నారు.

మాజీ ఐఆర్ఎస్ అధికారి పర్యవేక్షణలో 

మాజీ ఐఆర్ఎస్ అధికారి పర్యవేక్షణలో గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్​గా ఉన్న బి.ఎం.వినోద్​ కుమార్ దీనిని పర్యవేక్షించనున్నారు. గల్ఫ్​లో మనవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే అవి సెక్రటేరియెట్​లోని జీఏడికి చేరుకుంటాయి. అక్కడ ఒక మానిటరింగ్ సెల్ ఉంటుంది. దాని ద్వారా ఆయా దేశాల రాయబారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తారు. దీని కోసం ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇన్​చార్జ్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ఎన్నారై విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.