ఇల్లందులో ఇండిపెండెంట్​గా పోటీ చేస్తా: గుమ్మడి అనురాధ

ఇల్లందులో ఇండిపెండెంట్​గా పోటీ చేస్తా: గుమ్మడి అనురాధ
ఇల్లెందు, వెలుగు:  రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ గుమ్మడి అనురాధ స్పష్టం చేశారు. బుధవారం ఇల్లందు ప్రెస్​క్లబ్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛమైన పాలన అందించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్, బయ్యారం స్టీల్ ప్లాంట్, యువతకు విద్య, ఉపాధి కల్పనే తన రాజకీయ ఎజెండా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇల్లందు రాజకీయాలు కలుషితమయ్యాయని, వాటిని సరిచేసేందుకే తాను రంగంలోకి దిగుతానని తెలిపారు. 

గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లిందని, బయ్యారం ఉక్కు.. మన హక్కు అని చెప్పి గెలిచిన వాళ్లు ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బిడ్డలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఇచ్చారని, ఆయన అనుమతితోనే రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. 25 సంవత్సరాల క్రితం స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి నర్సయ్య చిన్న బడ్జెట్ తోనే గ్రామాల్లో రోడ్లు, స్కూళ్లు, డ్రైనేజీ సౌకర్యం కల్పించారని,  గడిచిన పది సంవత్సరాల కాలంలో ఇల్లందు అభివృద్ధిలో వెనుకబడిందని ఆమె తెలిపారు.  నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో నవీన్, చంటి, పసి, కల్తి వెంకన్న, పాయం నితీశ్​ తదితరులు పాల్గొన్నారు.