కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.4,500 కోట్లు కేటాయించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి విన్నవించారు. సోమవారం ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా, సంఘ సభ్యులు పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమావేశంలో బల్దియా మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వరంగల్ పట్టణం రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమని, కీలకమైన విద్య, పారిశ్రామిక కేంద్రంగా మారిందని, నగర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర సంస్కృతి విలువలను గుర్తించి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ప్రస్తుతం వరంగల్ పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రభావం చూపుతోందని, రూ.4,000 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్రూపొందించామన్నారు. ఈ అవసరమైన సంవత్సరానికి కనీసం రూ.1,000 కోట్ల చొప్పున అభ్యర్థిస్తున్నామన్నారు. బయో-మైనింగ్ ప్లాంట్ల స్థాపనకు రూ.100 కోట్లు అవసరమని, జాగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ సిస్టం ఏర్పాటుకు రూ.100 కోట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. 42 కొత్త గ్రామాల విలీనంతో, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కనీస మౌలిక సౌకర్యాలైన రోడ్లు, పబ్లిక్ యుటిలిటీలు పౌర సేవలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం అంచనా వేసిన జనాభా ఆధారంగా తలసరి గ్రాంట్ అవసరమని మేయర్ అన్నారు.
అంతకుముందు మేయర్ సుధారాణి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియాను శాలువాతో సత్కరించారు. సమావేశంలో ఫైనాన్స్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి రామకృష్ణ రావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సీడీఎంఏ వీపీ గౌతమ్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానజీ వాకడే, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.