ఇందుగలరు...అందుగలరని సందేహము వలదు..ఎందెందు వెతికినా..అన్ని రంగాల్లోనూ సైబర్ నేరగాళ్లు కలరు. సైబర్ నేరగాళ్ల దుంపతెగ. ఇన్నాళ్లు ఆన్ లైన్లో బాధితులను బెదిరిస్తూ..మాయ మాటలతో మోసం చేస్తూ..డబ్బులను దోచుకున్నారు. కానీ ఈ కేటుగాళ్లు...ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. ఫోర్జరీ సంతకాలతో ఏకంగా రూ. 40 కోట్ల భూమిని కాజేద్దామని ప్లాన్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
గుర్గావ్‌లోని బేగంపూర్ కటోలా గ్రామంలో ఎన్నారై పురాణ్ మంచాందా 1980లో 1.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఈ భూమిని ఈ ఏడాది మార్చిలో కొందరు మోసపూరితంగా విక్రయించినట్లు ఎన్నారై పురాణ్ మంచాందా తెలుసుకున్నారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్గావ్‌లోని బేగంపూర్ కటోలా గ్రామంలోని ఎస్పీఆర్ రోడ్డులో ఉన్న తన భూమిని నకిలీ పత్రాలను ఉపయోగించి సుభాష్ చంద్ పేరుతో మోసపూరితంగా విక్రయించారని మంచాంద తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా..విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నారై పురాణ్ మంచాందా విదేశాల్లో నివసిస్తున్నాడని తెలుసుకున్న నిందితుడు సుభాష్ చంద్..అతని 1.5 ఎకరాల భూమిని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేశాడు. తన అనుచరులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించాడు. ఆ పత్రాల ఆధారంగా భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సుభాష్ చంద్ తన అల్లుడు టోనీ అనే న్యాయవాది ద్వారా భూమికి సంబంధించిన అసలైన పత్రాలను పొందాడు. అక్టోబర్ 2021లో టోనీ.. ఢిల్లీలోని కల్‌కాజీ తహసీల్ కార్యాలయంలో కాంట్రాక్టు రికార్డు కీపర్ అయిన సంజయ్ గోస్వామి నుండి భూమి వివరాలను కలిగి ఉన్న అసలైన 1996 లెడ్జర్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత కంప్యూటర్లు, స్కానర్లు, సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి సుభాష్ చంద్ పేరుతో నకిలీ జీపీఏను సృష్టించి, లెడ్జర్‌లోని నిజమైన జీపీఏను భర్తీ చేశారు.
ALSO READ : ఇంటర్నేషనల్ క్రికెట్ మాఫియా : రూ.350 కోట్ల బెట్టింగ్ ముఠా అరెస్ట్
అలాగే 2001లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మేజర్ పీకే మెహతా అనే వ్యక్తి పేరును సాక్షిగా నకిలీ పత్రంలో పొందు పర్చాడు. మరో సాక్షిగా అడ్వకేట్ సందీప్ పేరును చేర్చాడు. నకిలీ పత్రాలపై టోనీ యాదవ్ నకిలీ సంతకాలు చేసినట్లు తేలింది. ఈ నకిలీ పత్రాల ఆధారంగా ఎన్నారై పురాణ్ మంచాందాకు చెందిన 1.5 ఎకరాల భూమిని వినోద్ అనే వ్యక్తికి బదలాయించారు. ఆ తర్వాత రూ. 6.6 కోట్లకు ఈ భూమిని సుభాష్ చంద్ కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశారు. వీరికి ఏఎస్‌ఐ ప్రదీప్ లంచం తీసుకుని సహకరించారని పోలీసులు తెలిపారు.
ప్రధాన నిందితుడు సుభాష్ చంద్, న్యాయవాది టోని యాదవ్, ఢిల్లీలోని కల్‌కాజీ తహసీల్ కార్యాలయంలో కాంట్రాక్టు రికార్డు కీపర్ సంజయ్ గోస్వామి, భూ పత్రాలను నకిలీ చేసిన భీమ్‌సింగ్ రాఠీ, ASI ప్రదీప్ లపైబాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 120-బి, 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.