ఇంటర్నేషనల్ క్రికెట్ మాఫియా : రూ.350 కోట్ల బెట్టింగ్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రికెట్ మాఫియా : రూ.350 కోట్ల బెట్టింగ్ ముఠా అరెస్ట్

విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్‌ బెట్టింగ్‌ దందాను సైబర్‌ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్‌ చేస్తున్న  కింగ్‌ మోను అలియాస్‌ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  అనామక మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నారు.

కాగా ఒక్క కింగ్‌ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులనుంచి నగదు, సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని  వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. అయితే  బెట్టింగ్ ఉచ్చులో పోలీసులకు చిక్కిన  విశాఖ పరిసర ప్రాంతాల యువత.. బెట్టింగ్ ముఠాను విడుదల చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఈ కేసును సీపీ రవిశంకర్‌ స్వయంగా విచారణ చేస్తున్నారు. 

క్రికెట్ బెట్టింగ్‌ను నడిపించే ముంబయ్, డిల్లీ, హైదరాబాద్ సంబంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహస్యంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్‌ బెట్టింగ్‌లో భాగంగా పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్‌ భాష వినియోగిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు. బుకీల దగ్గర రిజిస్టర్‌ అయిన నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగానే స్పందిస్తున్న యువత బెట్టింగుకు మొగ్గు చూపుతున్నారు. బెట్టింగ్‌ రాయుళ్లు కోడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. మ్యాచ్‌ జరిగే రోజున అప్పటికప్పుడే ఆన్‌లైన్‌ ద్వారా లావాదేవీలు జరుపుతూ యువత బెట్టింగులో పాల్గొంటున్నారు. క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారిచేస్తూనే ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం బెట్టింగ్ లనే వృత్తిగా సాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడేవారి పై కఠిన చర్యలు తీసుకోవాల ని స్థానిక ప్రజలు కోరుతున్నారు.