
ఇటీవలి కాలంలో భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి, పన్నుల భారం వంటి అంశాలపై కంపెనీల సీఈవోలు సైతం స్పందిస్తున్నారు. భారతదేశంలో కనిపించకుండా భారీ ఒత్తిడితో ఆర్థికంగా మధ్యతరగతి ప్రజల జీవితాలు ఎలా కుదేలవుతున్నాయనే విషయాలు ఒక్కొక్కటిగ బయటకు వస్తున్నాయి.
తాజాగా గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న నెక్స్ట్ కీస్ రియల్టర్ సీఈవో వీరేష్ సింగ్ మధ్యతరగతి ప్రజలకు జరుగుతున్న అన్యాయం, వారిపై కొనసాగుతున్న దోపిడీ గురించి ఒక పోస్ట్ చేశారు. వాస్తవానికి భారతదేశంలో వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను రహితం దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. అలాగే దేశంలో వ్యాపారం చేసుకునే చిన్న వీధి దుకాణదారుల సంపాదనపై కూడా ఎలాంటి జీఎస్టీలు, పన్నులు లేవని అన్నారు. ఈ రెండు కేటగిరీల కింద ఉన్న ప్రజల ఆదాయం ఏడాదికి రూ.కోటి ఉన్నప్పటికీ వారు దానిపై కట్టాల్సిన పన్ను సున్నా రూపాయలు.
ఇదే మధ్యతరగతి వేతన జీవి గనుక ఏడాదికి రూ.కోటి సంపాదిస్తే దానిపై ఎలాంటి తగ్గింపులు, సబ్సిడీలు ఉండవు. పైగా వారు దీనిపై ఆదాయపు పన్ను శాఖకు పన్ను రూపంలో రూ.31 లక్షలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇదే కోటి రూపాయలను కార్పొరేట్ సంస్థ ఆదాయంగా పొందితే వారు దాని లాభాల్లో రూ.25 లక్షలు టాక్స్ కడితే సరిపోతుందని గుర్తు చేశారు. పైగా వ్యాపార సంస్థలకు ప్రభుత్వం నుంచి కొన్ని ప్రోత్సాహకాలు, తగ్గింపులు కూడా లభిస్తుంటాయి.
2023-24 సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సమాచారం ప్రకారం మెుత్తం దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్య 3కోట్ల 60 లక్షలుగా ఉంది. వీరిలో దాదాపు కోటి 50 లక్షల మంది ఉద్యోగులే. కేవలం ఈ ఉద్యోగులే మెుత్తం ప్రభుత్వానికి వస్తున్న ఆదాయపు పన్నులో 60 శాతం చెల్లింపులను అందిస్తున్నారు. ఇక్కడ మధ్యతరగతికి చెందిన ఉద్యోగులు తప్ప మిగిలిన అందరికీ పన్ను తక్కువగా ఉండటం లేదా పన్ను వ్యవస్థ నుంచే వారు ఉపశమనం పొందుతున్నారని సింగ్ పేర్కొన్నారు.
2025 ఆధునిక టెక్నాలజీ యుగంలో భారత్ ఇలాంటి వాటిని గమనించి అవసరమైన పన్ను రిఫామ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఈవో చేసిన పోస్ట్ చెబుతోంది. భారతదేశానికి తన రైతులు కావాలి, వీధి వ్యాపారులు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి అయితే మౌనంగా పన్నుల భారం కింద నలిగిపోతున్న మధ్యతరగతి వేతన జీవులపై దృష్టి ముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఎక్కువగా తోడ్పతున్న ఈ కేటగిరీలోని భారతీయులు ఈ సమస్యలపై నోరెత్తకపోవటం వల్లనే వారిని ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తోందని సింగ్ అభిప్రాయపడ్డారు.