ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురుకుల స్టూడెంట్ మృతి

ట్రీట్ మెంట్ తీసుకుంటూ గురుకుల స్టూడెంట్ మృతి
  • స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ 
  • సంగారెడ్డి జిల్లా నల్లవాగు 
  • సోషల్ వెల్ఫేర్ స్కూల్ వద్ద ఆందోళన

నారాయణ్ ఖేడ్, వెలుగు: చికిత్స పొందుతూ గురుకు ల స్కూల్ విద్యార్థి మృతిచెందగా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే  చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిర్గాపూర్ మండలం నల్లవాగు సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో తొమ్మిదో తరగతి స్టూడెంట్ నిఖిల్ కు గత బుధవారం ఫీవర్ రావడంతో  సిబ్బంది పేరెంట్స్ కు సమాచారం ఇచ్చి ఇంటికి పంపించారు.

హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి శుక్రవారం రాత్రి చనిపోయాడు. దీంతో  స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే  తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ శనివారం స్కూల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి రాజకీయ, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపారు.  స్టూడెంట్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం ఇచ్చి ఒకరికి జాబ్ కల్పించాలని డిమాండ్ చేశారు.

స్కూల్ వద్దకు నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తి, సీఐ శ్రీనివాస్ రెడ్డి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  నారాయణఖేడ్ ఎమ్మెల్యే  సంజీవరెడ్డి స్కూల్ ను తనిఖీ చేసి స్టూడెంట్ మృతికి కారణాలను ప్రిన్సిపల్, స్టాప్, స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించాలని,  విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.