పద్మశ్రీ అందుకున్న కనకరాజు

పద్మశ్రీ అందుకున్న కనకరాజు

గుస్సాడీ కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు పద్మ అవార్డులను 2021 సంవత్సరానికి గాను 119 మంది అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి గుస్సాడీ కళాకారుడు కనకరాజు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు.. ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో సుప్రసిద్ధుడు. 55 సంవత్సరాలుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆసక్తి చూపే వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కనకరాజుతో పాటు ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామి కళలు, అసవడి ప్రకాశ్‌రావు సాహిత్యం, విద్య, నిడదవోలు సుమతి కూడా పద్మశ్రీ అందుకున్నారు. వీరితోపాటు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు వచ్చిన రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్‌ అవార్డును ఆయన మరణానంతరం వారి కుటుంబసభ్యలకు అందజేశారు.