బట్టతలకు డైజేషన్ కు లింక్!..కడుపు ఆరోగ్యంగా లేకుంటే జుట్టు రాలడం ఖాయం..త్రాయ సంస్థ నివేదిక వెల్లడి

బట్టతలకు డైజేషన్ కు లింక్!..కడుపు ఆరోగ్యంగా లేకుంటే జుట్టు రాలడం ఖాయం..త్రాయ సంస్థ నివేదిక వెల్లడి
  • 1.6 లక్షల మందిపై రీసెర్చ్‌‌‌‌
  • గట్ హెల్త్‌‌‌‌ క్షీణతలో దేశంలోనే తెలంగాణ టాప్
  • అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, మోడ్రన్​లైఫ్​స్టైల్ వల్లే దెబ్బతింటున్న జీర్ణ వ్యవస్థ
  • రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న మలబద్ధకం బాధితుల సంఖ్య
  • బట్టతలకు చికిత్స తీసుకునే ముందు గట్ హెల్త్ చూసుకోండి: సలోని ఆనంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు:మన రాష్ట్రంలో చాలామంది జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్నారు. గట్ హెల్త్ (జీర్ణ ఆరోగ్యం) క్షీణించడం వల్ల తిన్నది అరగక, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ సమస్య కేవలం కడుపుకే పరిమితం కాకుండా పురుషుల్లో జుట్టు రాలడానికి, చివరికి బట్టతలకు ప్రధాన కారణమవుతోందని ఒక తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రముఖ ఇండియన్ హెల్త్-టెక్ బ్రాండ్ ‘త్రాయ’ జరిపిన అధ్యయనంలో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

 జుట్టు రాలడానికి గల అంతర్గత కారణాలను గుర్తించే క్రమంలో ‘త్రాయ’ సంస్థ దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది పురుషులపై ఏడాది పాటు (డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు) అధ్యయనం చేసింది. తెలంగాణతో పాటు రాజస్తాన్, ఢిల్లీ, గుజరాత్ వంటి 10 రాష్ట్రాల్లో  సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో  జీర్ణారోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.పైగా, పురుషుల్లో జుట్టు రాలడానికి, జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తేలింది. ఇది తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని బట్టబయలు చేసింది. 

పరిస్థితి ఆందోళనకరం

గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మలబద్ధకం లేని (ఆరోగ్యకరమైన గట్ ఉన్న) వారి సంఖ్య ఏడాదిలోనే భారీగా పడిపోయింది. డిసెంబర్ 2024లో 19.13 శాతం మంది తమకు జీర్ణ సమస్యలు లేవని చెప్పారు.డిసెంబర్ 2025 నాటికి ఈ సంఖ్య 15.03 శాతానికి పడిపోయింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే 4.10 శాతం మంది అదనంగా దీర్ఘకాలిక జీర్ణ సమస్యల బారిన పడ్డారు. రాష్ట్ర జనాభాను బట్టి చూస్తే, ప్రతి ఏటా వేలాది మంది పురుషులు తమకు తెలియకుండానే ఆరోగ్య సంక్షోభంలోకి జారుకుంటున్నారు.ఈ సమస్య ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో  రాజస్తాన్ (-3.3%)రెండో స్థానంలో, ఢిల్లీ -(2.97%)మూడో స్థానంలో నిలిచాయి. 

జీర్ణక్రియకు, బట్టతలకు సంబంధం ఏంటంటే..

షాంపూలు, నూనెలు మార్చినంత మాత్రాన జుట్టు రాలడం తగ్గదని, సమస్య మన కడుపులోనే ఉందని పరిశోధకులు తేల్చారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. మలబద్ధకం లేదా జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారంలోని ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు సరిగ్గా అందవని..దీనివల్ల జుట్టు బలహీనపడి రాలిపోతుందని తెలిపారు. ఇక రెండోది..అంతర్గత వాపు సమస్య. అంటే జీర్ణక్రియ సరిగ్గా లేకపోతే శరీరంలో అంతర్గత వాపు మొదలవుతుంది. ఇది జుట్టు పెరిగే దశను అడ్డుకుని, రాలిపోయే దశను వేగవంతం చేస్తుంది.

నగర యువతలోనే ముప్పు ఎక్కువ

30 ఏండ్లు నిండకముందే బట్టతల రావడం ఇప్పుడు సాధారణమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి ఐటీ హబ్‌‌‌‌‌‌‌‌లలో ఉండేవారు, చదువుకున్న యువతలోనే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.10 నిమిషాల్లో డెలివరీ అయ్యే అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, పని ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, సరిపడా నీళ్లు తాగకపోవడం, మానసిక ఒత్తిడి  దీనికి ప్రధాన కారణాలని స్టడీ వెల్లడించింది.

ఇది పైపైన సమస్య కాదు

"జుట్టు రాలుతుందంటే అది కేవలం పైపైన సమస్య అని అనుకోవద్దు. మన శరీరంలోని అంతర్గత వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు శరీరం ఇచ్చే మొదటి హెచ్చరిక ఇది. గట్ హెల్త్, హార్మోన్లు, ఒత్తిడిని సరిచేయకుండా కేవలం జుట్టుకు చికిత్స చేస్తే ఫలితం ఉండదు" - సలోని ఆనంద్‌‌‌‌‌‌‌‌త్రాయ హెల్త్‌‌‌‌‌‌‌‌ సహ వ్యవస్థాపకురాలు .

రాష్ట్రాలవారీగా జీర్ణ ఆరోగ్య గణాంకాలు (2024-25)

రాష్ట్రం / ప్రాంతం     డిసెంబర్ 2024    డిసెంబర్ 2025    మార్పు (శాతంలో)
తెలంగాణ    19.13%    15.03%    −4.10%
రాజస్తాన్    23.18%    19.87%    −3.30%
ఢిల్లీ     22.75%    19.78%    – 2.97%
మధ్యప్రదేశ్    24.36%    22.06%    −2.30%
గుజరాత్    24.05%    21.78%    −2.27%
బిహార్    26.27%    24.27%    −2.00%
ఉత్తరప్రదేశ్    25.47%    23.65%    −1.81%
మహారాష్ట్ర    20.57%    18.77%    −1.80%
తమిళనాడు    17.92%    16.62%    −1.30%
(గమనిక: మైనస్ విలువ పెరగడం అంటే ఆ రాష్ట్రంలో జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయని అర్థం.అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అత్యధికంగా జీర్ణ ఆరోగ్యం దెబ్బతిన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి)