పొగపెడ్తున్న క్యాన్సర్ ! గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ఏటా 20 వేల మందికి క్యాన్సర్

పొగపెడ్తున్న క్యాన్సర్ ! గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ఏటా 20 వేల మందికి క్యాన్సర్
  • గుట్కా, ఖైనీ, సిగరెట్లతో ఏటా 20 వేల మందికి వ్యాధి
  • మగవారిలో 58.8 శాతం, మహిళల్లో 
  • 29.7 శాతం మందికి ముప్పు
  • 60 శాతం కేసులు ముదిరాకే గుర్తింపు.. 
  • 2026లో 46 వేల కొత్త కేసులు
  • ఐసీఎంఆర్, ఎన్సీడీఐఆర్ తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్ రిపోర్టులో వెల్లడి 
  • ఎంఎన్​జే, నిమ్స్​ సహా 10 ప్రధాన హాస్పిటల్స్​లో నమోదైన కేసుల ఆధారంగా నివేదిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి పొగపెడుతున్నది. నిమిషాల మత్తు కోసం నమిలే గుట్కా, పీల్చే పొగ.. వేల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ ఇన్ఫర్మాటిక్ అండ్ రీసెర్చ్(ఎన్సీడీఐఆర్) ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026’ రిపోర్టు  టొబాకో రిలేటెడ్ క్యాన్సర్ల గురించి కీలక విషయాలను బయటపెట్టింది. 

రాష్ట్రంలోని నిమ్స్, ఎంఎన్జే సహా 10 ప్రధాన హాస్పిటల్స్ లో నమోదైన కేసులను విశ్లేషించిన ఐసీఎంఆర్.. 2026 నాటికి రాష్ట్రంలో ఏకంగా 46,762 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందులో సుమారు 20 వేల క్యాన్సర్ కేసులు కేవలం పొగాకు ఉత్పత్తుల వల్లే వస్తాయని తేల్చింది. శుక్రవారం నిమ్స్ హాస్పిటల్ లో  నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప, ఎంఎన్జే డైరెక్టర్ ప్రొఫెసర్ సదాశివుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాప్తి, క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టు వివరాలను విడుదల చేశారు. 

  • పొగాతో ఏటా 20 వేల మందికి.. 

రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో పొగాకు ఉత్పత్తుల కారణంగా వచ్చేవే మెజారిటీ వాటా కలిగి ఉన్నాయి. 2026లో అంచనా వేసిన మొత్తం కేసుల్లో..  ఆడ, -మగ కలిపి సుమారు 20 వేల మంది పొగాకు వాడకం వల్ల ప్రాణాంతక వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఇందులో మగవాళ్లు అత్యధికంగా 58.8 శాతం అంటే.. సుమారు 12,496 కేసులు ఉండగా, మహిళల్లో 29.7 శాతం అంటే సుమారు 7,576 కేసులు పొగాకు ప్రభావం వల్ల క్యాన్సర్ బారిన పడనున్నట్టు రిపోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం గుట్కాను బ్యాన్ చేసినా.. పాన్ డబ్బాల నుంచి కిరాణా షాపుల వరకు అక్రమంగా దొరుకుతుండటమే ఈ కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటి క్యాన్సర్లే ఎక్కువ..

పొగాకు ఉత్పత్తుల వల్ల వస్తున్న క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ 23 శాతంతో టాప్‌ లో ఉంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల క్యాన్సర్ 18 శాతం, నాలుక క్యాన్సర్ 14 శాతం, జీర్ణాశయ క్యాన్సర్ 10 శాతంగా నమోదవుతున్నాయి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ 36.2% తో కీలక స్థానంలో ఉన్నది. ప్రతి 6గురు మహిళల్లో ఒకరు, ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్ లెక్కలు హెచ్చరిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా ఈ వ్యాధి విస్తృతికి తోడవుతున్నట్లు పేర్కొంది. 

ముదిరిన తర్వాతే హాస్పిటల్‌ కు..

వ్యాధి లక్షణాలపై అవగాహన లేకపోవడం, స్క్రీనింగ్ పరీక్షల పట్ల నిర్లక్ష్యం బాధితుల పాలిట శాపంగా మారుతున్నదని రిపోర్టు పేర్కొన్నది. మగవారిలో కేవలం 2.6 శాతం మందే నోటి క్యాన్సర్ టెస్టులు చేయించుకుంటున్నారని రిపోర్టు పేర్కొంది. సుమారు 60 శాతం మంది బాధితులు వ్యాధి 3, 4వ స్టేజ్‌ కు చేరి, శరీరం అంతా పాకిన తర్వాతే హాస్పిటల్స్‌ కు వస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుండటంతో మరణాల రేటు పెరుగుతున్నది. దీనికి తోడు 43.3% మంది పురుషులు మద్యం తాగుతుండటం, 30% మందికి పైగా ఊబకాయంతో బాధపడుతుండటం క్యాన్సర్ ముప్పును మరింత పెంచుతున్నది.

ఆడవారికి పాసివ్ స్మోకింగ్ ముప్పు.. 

మగవాళ్లలో పొగాకు వాడకం 22.3 శాతంగా ఉండటంతో వారిలో నోటి, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. అయితే, మహిళల్లో పొగాకు వాడకం కేవలం 5.6 శాతమే ఉన్నప్పటికీ, వారిలో నమోదయ్యే కేసుల్లో 29.7 శాతం పొగాకు ప్రభావం వల్లే రావడం గమనార్హం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తుల క్యాన్సర్లు రావడానికి ఈ అలవాట్లతో పాటు పాసివ్ స్మోకింగ్ అంటే..  ఇతరులు వదిలే పొగను పీల్చడం కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చిన్నారులను కూడా ఈ రక్కసి వదలడం లేదు. 2026 లో 1,199 మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని రిపోర్టు 
వెల్లడించింది.

లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాల్సిందే.. 

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తేనే ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నోటిలో చాలా కాలం పాటు తగ్గని పుండ్లు, తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, గొంతు బొంగురుపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, ఎడతెగని దగ్గు, గొంతులో గడ్డలు వంటివి కనిపిస్తే వెంటనే స్క్రీనింగ్ చేయించుకోవాలి. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ వంటి మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా గుర్తిస్తే ఈ మహమ్మారిని 80 శాతం వరకు నయం చేసే అవకాశం ఉంటుంది. పొగాకు, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడమే దీనికి అసలైన విరుగుడని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే 80 శాతం నయం

చాలా మంది రోగం ముదిరిన తర్వాతే చికిత్సకు వస్తున్నారు. క్యాన్సర్‌ ను మొదటి దశలో గుర్తిస్తే 80 శాతం వరకు నయం చేయవచ్చు. పొగాకు సంబంధిత క్యాన్సర్లు పెరగడానికి గుట్కా, స్మోకింగ్, హుక్కా కల్చర్ కారణం. వాటిని పూర్తిగా మానేయాలి. చిన్నపాటి లక్షణాలు కనిపించినా వెనకాడకుండా స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికే ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మన్ముందు మరిన్ని చర్యలు తీసుకోబోతున్నది. 

- ప్రొఫెసర్ సదాశివుడు, 
డైరెక్టర్, ఎంఎన్జే క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్