- ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెట్టినా.. నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు: మండలి చైర్మన్ గుత్తా
- కవిత స్వయంగా కలిసి చెప్పాకే రాజీనామా ఆమోదించానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో కొత్త పార్టీకి స్కోప్లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై స్పందిస్తూ ‘‘ఇప్పటికే ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయి.. ఒకవేళ కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు’’ అని అన్నారు. గురువారం మండలి కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ సాధ్యం ఆచరణలో అంత సులభం కాదని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
ఎంత అభివృద్ధి చేసినా.. వ్యక్తిగతంగా ఎంత సహాయం చేసినా.. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి పరిస్థితి మారిపోతుందన్నారు. కవిత తన రాజీనామాను మొదట పీఏ ద్వారా పంపించారని.. అందుకే ఆమోదించలేదని.. ఇటీవల ఆమె తనను కలిసి ఆమోదించాలని కోరగానే ఓకే చేశానన్నారు. ఏ సభ్యుడైనా సరే నేరుగా కలిసి ఆమోదించాలని కోరితేనే దాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఏ చట్టసభలో అయినా ఇదే పద్ధతి ఉంటుందని చెప్పారు. రాజీనామా చేసే వారు సభలో ప్రసంగిస్తానంటే అందుకు అంగీకరించాల్సిందేనని.. కవిత విషయంలో తాను ఇదే పాటించానని చెప్పారు. గత పదేండ్లలో అప్పటి ప్రభుత్వం గోదావరి నీళ్లపై, ఆ ప్రాజెక్టులపై చూపిన శ్రద్ధ.. కృష్ణా నదిపై చూపలేదని విమర్శించారు. మూసీ నది కాలుష్యం నల్గొండ జిల్లా వరకు విస్తరించిందన్నారు.
