కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నరు

కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నరు

కామారెడ్డి/నిజాంసాగర్, వెలుగు : ప్రజలు వరద నీటిలో మునిగి ఉంటే.. కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మాత్రం అవినీతిలో మునిగి ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన సొమ్ముతో అన్ని గ్రామాల్లో సౌలత్​లు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వచ్చన్నారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. బ్రహ్మణ్ పల్లి హనుమాన్ గుడి వద్ద పూజలు చేసిన తర్వాత బైక్ ర్యాలీని ప్రారంభించారు. 

కేంద్రం ఇచ్చిన బియ్యం పేదలకు పంచట్లేదు
బైక్ ర్యాలీ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ ధరణి పోర్టల్​తో పేద రైతులకు అన్యాయం జరిగిందని, వారసత్వంగా వచ్చిన భూములను కూడా కోల్పోవాల్సి వస్తోందన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్​ను పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని వివేక్ ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన వేల కోట్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్​హౌస్​లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ మరిచిపోయారని విమర్శించారు. పేదలకు డబుల్​ బెడ్ రూం ఇండ్లు రాలేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా పూర్తిస్థాయిలో నీళ్లు రావడం లేదని, వచ్చిన చోట జనం తాగేలా ఉండడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా ఫండ్స్ ఇస్తున్నా వాటిని సరిగ్గా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. కరోనా టైంలో పేదలకు కేంద్రం ఉచిత బియ్యం ఇస్తే వాటిని రాష్ట్ర సర్కారు పంపిణీ చేయడం లేదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని రమ్మని స్వయంగా ప్రధాన మంత్రి మోడీయే తమను పంపారని చెప్పారు.

సమస్యలు తెలుసుకొంటూ.. భరోసా కల్పిస్తూ
పలువురు మహిళలు, వృద్ధులు వివేక్ వెంకటస్వామి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార ముందు తమ సమస్యల్ని ఏకరువు పెట్టారు. సమస్యల్ని విన్న ఆయన వారికి భరోసా కల్పించారు. రైతుబంధు సొమ్ము బ్యాంకు ఖాతాల్లో వేసినప్పటికీ లోన్లు కట్టలేదని సీజ్​చేస్తున్నారని వాపోయారు. తనకు ఇప్పటికీ పట్టాబుక్కు ఇవ్వలేదని ఎంకవ్వ అనే మహిళ వాపోగా.. వివేక్ తహసీల్దార్​తో ఫోన్​లో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్​చార్జి బద్ధం మహిపాల్​రెడ్డి, ఆయా నియోజకవర్గ ఇన్​చార్జీలు కాటిపల్లి వెంకటరమణరెడ్డి, మల్యాద్రిరెడ్డి, ఎంజీ వేణుగోపాల్​గౌడ్, నీలం చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.