ఉద్యోగం పోయి, దేశం విడిచే పరిస్థితి..అమెరికాలో భారతీయ టెకీల పరేషాన్

ఉద్యోగం పోయి, దేశం విడిచే పరిస్థితి..అమెరికాలో భారతీయ టెకీల పరేషాన్
  • 60 రోజుల్లో జాబ్​ రాకుంటే ఇండియాకే 
  • హెచ్​1బీ టెకీలకు అమెరికా వార్నింగ్​
  • ఇప్పటికే 1.10 లక్షల మంది తొలగింపు
  • మళ్లీ వీసా రావడం చాలా కష్టం

న్యూఢిల్లీ: ఎన్నో ఆశలతో అమెరికాలోకి అడుగుపెట్టిన హెచ్​1బీ వీసాహోల్డర్ల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది. ఒకవైపు జాబ్​పోయి బాధపడుతుంటే, అక్కడ సర్కారేమో వెనక్కి వెళ్లిపోవాలంటూ సతాయిస్తోంది. బాధితులు విదేశంలో ఉండలేకా, స్వదేశానికి రాలేకా సతమతమవుతున్నారు. ఫేస్​బుక్ ​పేరెంట్​ కంపెనీ మెటా తాజాగా ఎనిమిది వేల మందిని తీసేసింది. ఇతర కంపెనీలూ ఇదే బాటపట్టాయి. అమెజాన్, లింక్డ్‌‌ఇన్ కూడా ఉద్యోగాలకు కోతపెట్టాయి. 

యూఎస్​ కంపెనీలు ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాయి. అమెరికాలో ఎక్కువ మంది భారతీయ టెక్ నిపుణులు హెచ్​-1బీ వీసాలపై పనిచేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయాక 60 రోజుల్లో మరో కంపెనీ హెచ్​1బీ వీసా స్పాన్సర్​ చెయ్యకపోతే  తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే! ఎంతోమంది భారతీయులు గ్రీన్ కార్డ్‌‌ల కోసం  ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొంతమందికి అక్కడే పిల్లలూ పుట్టారు. ఇళ్లూ కొనుక్కున్నారు. ఉద్యోగం పోవడంతో వీరి పరిస్థితి గందరగోళంగా మారింది.  అమెరికాలో వీలైనంత ఎక్కువ కాలం ఉండటానికి దారులు వెతుక్కుంటున్నారు.  కొందరు బీ-2 విజిటర్ వీసా కోసం చూస్తున్నారు. 

తొలగింపులే.. నియామకాలు బంద్​

ఉద్యోగం పోయిన మరుసటి రోజు నుంచి రెండు నెలల్లోపు హెచ్​1బీ టెకీలు కొత్త కంపెనీలో చేరాలి. లేదా వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలి.  ఆర్థిక అనిశ్చితి, ఏఐ కారణంగా టెక్​నిపుణుల అవసరం తగ్గిపోవడంతో కంపెనీలు కొత్త ఉద్యోగాలు ఇవ్వడాన్ని భారీగా తగ్గించాయి. ఈ పరిస్థితుల్లో కొత్త స్పాన్సర్‌‌ను సంపాదించడం చాలా కష్టం.  

layoff.fyi రిపోర్ట్​ ప్రకారం ఈ ఏడాది టెక్ కంపెనీలలో 1.10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది హెచ్​-1బీ వీసాలు ఉన్న భారతీయులే!   బాధితుల్లో దాదాపు సగం మంది కొత్త జాబ్ ​రాకుంటే స్వదేశానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారని తాజా సర్వే రిపోర్ట్​ వెల్లడించింది.