
వాషింగ్టన్: హెచ్1బీ వీసా కొత్త రూల్స్ నుంచి డాక్టర్లు, మెడికల్ వర్కర్లకు మినహాయింపు ఇవ్వవచ్చని వైట్ హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ వెల్లడించారు. ఇకపై హెచ్1బీ వీసా అప్లికేషన్‌కు లక్ష డాలర్ల చొప్పున ఫీజు చెల్లించాలంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త రూల్ నుంచి ఎవరికి మినహాయింపు ఉంటుందన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టేలర్ రోజర్స్ ‘బ్లూమ్ బర్గ్’ మీడియా సంస్థకు ఈ–మెయిల్ ద్వారా వివరణనిచ్చారు.
రూరల్ అమెరికాలో డాక్టర్లు, మెడికల్ వర్కర్ల కొరత ఉందని, హెచ్1బీ వీసా ఫీజు పెంపుతో విదేశీ డాక్టర్లు, సిబ్బంది సంఖ్య తగ్గిపోతే గ్రామీణ అమెరికన్లకు వైద్యం అందడం కష్టమవుతుందంటూ వైద్య వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్ సంతకం చేసిన ‘ప్రొక్లమేషన్ (ప్రకటన)’లో మినహాయింపులూ ఉన్నాయని రోజర్స్ తెలిపారు.
దేశ ప్రయోజనాల కోసం ఒక కంపెనీ లేదా ఇండస్ట్రీ లేదా వ్యక్తిగతంగా స్కిల్డ్ వర్కర్లను హెచ్1బీ వీసా ద్వారా నియమించుకున్నట్టుగా హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి ధ్రువీకరిస్తే గనక.. పెంచిన ఫీజు మినహాయింపు వర్తిస్తుందన్నారు. అయితే, డాక్టర్లు, మెడికల్ వర్కర్లందరికీ గంపగుత్తగా ఈ మినహాయింపు వర్తిస్తుందా..? లేదంటే కేస్ బై కేస్‌గా పరిశీలిస్తారా..? అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదు.
హెచ్1బీకి ప్రత్యామ్నాయంగా ఎల్1..?
హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరిగిన నేపథ్యంలో ఎల్1 వీసా ప్రత్యామ్నాయంగా మారుతుందన్న ప్రచారం సాగుతోంది. అయితే, ఎల్1 వీసా కొంతవరకు మాత్రమే ప్రత్యామ్నాయం అవుతుందని ఎక్స్ పర్ట్లు చెప్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా హయ్యర్ డిగ్రీ కలిగిన స్కిల్డ్ వర్కర్లను అమెరికన్ కంపెనీలు తీసుకునేందుకు హెచ్1బీ వీసాలను ఇస్తుండగా.. అమెరికన్ కంపెనీలకు విదేశాల్లో ఉన్న ఉద్యోగులను అమెరికాలోని తమ బ్రాంచ్‌లకు ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకే ఎల్1 వీసా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం ఏటా 85 వేల హెచ్1బీ వీసాలను ఇస్తుండగా, ఎల్1 వీసాలపై పరిమితిలేదు. కానీ.. ఎల్1 వీసాల దుర్వినియోగం జరగకుండా అడ్డుకునేందుకు ఏటా పెద్ద ఎత్తున దరఖాస్తులను రిజెక్ట్ చేసే అవకాశాలూ ఎక్కువే. ఉదాహరణకు 2019లో 76,988 ఎల్1 వీసాలు జారీ చేయగా.. 2021లో 24,863 వీసాలను మాత్రమే అప్రూవ్ చేశారు. 2023లో 76,671 వీసాలు జారీ చేశారు. గతంలో 10% దరఖాస్తులను తిరస్కరించేవారు. ఇప్పుడు 34% ఎల్1 అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారని పేర్కొంటున్నారు.